kumaram bheem asifabad- మే 10 వరకు స్వీయగణన చేసుకోవచ్చు
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:31 PM
జనాభా గణన 2027 మొదటి విడత కార్యక్రమంలో భాగంగా మే 10 వరకు తమ ఇంటి వివరాలను స్వీయగణన ద్వారా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో స్వీయ గణన, ఉపాధిహామీ పథకం, నకిలీ విత్తనాలు, ఇందన కొరత, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): జనాభా గణన 2027 మొదటి విడత కార్యక్రమంలో భాగంగా మే 10 వరకు తమ ఇంటి వివరాలను స్వీయగణన ద్వారా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో స్వీయ గణన, ఉపాధిహామీ పథకం, నకిలీ విత్తనాలు, ఇందన కొరత, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మన జనగణన మన అభివృద్ధిలో భాగంగా కేంద్రం చేపడుతున్న జనాభ గణన కార్యక్రమంలో భాగంగా మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన కొనసాగనుందని చెప్పారు. ఎన్యూమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలుఆన్‌లైన్ నమోదు చేస్తారన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన ద్వారా తమ ఇంటి వివరాలు, 33 ఆంశాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. తర్వాత ఎన్యూమరేటర్లు ఇంటిని సందర్శించినప్పుడు నమోదు చేసిన వివరాలను పరిశీలిస్తారని చెప్పారు. స్వీయ గణనను సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 994 మంది ఎన్యూమరేటర్లు, 174 మంది సూపరువైజర్లు, 1689 హౌస్ లిస్టింగ్ బ్లాకులుగా గుర్తించామని తెలిపారు. ఉపాధిహమీ పథకంలో పని ప్రదేశాలలో కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీలు ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల వరకు పనిని పూర్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ చెప్పారు. డిమాండుకు తగ్గట్టు సరఫరా ఉందన్నారు. అనవసరమైన వదంతులను నమ్మవద్దన్నారు. వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు జాగ్రత్తగా ఉండాలని, నకిలీ పత్తి విత్తనాలు మందులు కొనుగోలు చేయకూడదని చెప్పారు. అనుమతిలేని విత్తనాలు మందులు కొనుగోలు చేసినా విక్రయించినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎ గ్రేడ్ ధాన్యానికి రూ. 3,389, సాధారణ రకం ధాన్యానికి రూ. 2,369 మద్దతు ధర ఉందని కలెక్టర్ వివరించారు. సన్నరకం వరి ధాన్యానికి రూ. 500 క్వింటాలుకు బోనస్ ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సీపీవో వాసుదేవరెడ్డి, డీఏవో వెంకటి, డీపీఆర్‌వో సంపత్‌కుమార్, మాస్టర్ ట్రైనీ ఊశన్న తదితరులు పాల్గొన్నారు.