నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:27 AM
ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులకు మంత్రి సీతక్క సూచన
ములుగు, హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని సూచించారు. గ్రామాలను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో పాటు పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ పాలన, చట్టాలు, విధి, విధానాలు, ప్రణాళికల రూపకల్పన, నిధుల వినియోగంపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి చెప్పారు.
మంత్రి సీతక్కకు రేవంత్, చంద్రబాబు విషెస్
మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీతక్క ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో సీతక్క మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సీతక్కకు శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేష్ మంత్రి సీతక్కను గురువారం సచివాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.