గ్రామాల్లో ప్రగతి ఏదీ?
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:47 AM
గ్రామ పంచాయతీల పరిధిలో ఏటా రూ.34 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తున్నా.. అనుకున్న స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు ఎందుకు ప్రగతి సాధించడంలేదని...
ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు
అయినా గ్రామాల రూపురేఖలు మారడంలేదేం?: మంత్రి సీతక్క
అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించనని హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల పరిధిలో ఏటా రూ.34 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తున్నా.. అనుకున్న స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు ఎందుకు ప్రగతి సాధించడంలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు శాఖల పరిధిలో దాదాపు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఇంత భారీ యంత్రాంగం, నిధులు ఉన్నా.. గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో మారకపోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, వాటి పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఉపాధి హామీ పథకం అమలు, కూలీలకు పనిదినాల కల్పన, పెండింగ్ మెటీరియల్ బిల్లుల చెల్లింపులు, అంగన్‌వాడీ భవనాలు, మహిళాశక్తి భవనాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణాలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు, పారిశుధ్య నిర్వహణ, ఇంటిపన్నుల వసూళ్లు, స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యాల సాధన, గ్రామ కార్యదర్శుల హాజరు తదితర అంశాలపై జిల్లాల వారీగా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ విభాగాలు పని చేయాలన్నారు. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తనకు సమాచారం వస్తుందని, అలసత్వం వహిస్తే ఇకపై ఉపేక్షించబోనని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అసలైన అభివృద్ధి అని మంత్రి పేర్కొన్నారు.