మేడారానికి యునెస్కో గుర్తింపు తేవాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:51 AM
ప్రాకృతిక ప్రపంచ వారసత్వ సంపద (ఇంటాంజియబుల్ ప్రపంచ వారసత్వ సంపద)గా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ...
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కాకతీయ ట్రస్ట్‌ను కోరిన మంత్రి సీతక్క
హనుమకొండ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రాకృతిక ప్రపంచ వారసత్వ సంపద (ఇంటాంజియబుల్ ప్రపంచ వారసత్వ సంపద)గా మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వాహకులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి సీతక్క కోరారు. హైదరాబాద్‌లోని జ్యోతిరావుపూలే భవన్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ముద్రించిన ‘గిరిజన దేవతలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకూ తగిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా మేడారం జాతరకు విస్తృత ప్రచారం కల్పించడంలో విశేష కృషి చేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క అభినందించారు. ప్రముఖ చలన చిత్ర దర్శకుడు బీ.నర్సింగరావు మేడారం జాతరకు సంబంధించి అత్యంత అరుదైన ఛాయా చిత్రాలతోపాటు సమగ్ర సమాచారం జోడించి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, బీవీ పాపారావు, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, కె.శ్రీధర్, రిటైర్డ్ డీజీపీ ఎం.రతన్ తదితరులు పాల్గొన్నారు.