Share News

విప్లవోద్యమ విలువలతోనే మంత్రిస్థాయికి: సీతక్క

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:39 AM

తాను ఈ స్థాయికి ఎదగడానికి విప్లవోద్యమంలో నేర్చుకున్న విలువలు, క్రమశిక్షణే ప్రధాన కారణమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నర్సంపేట ఏరియా దళకమాండర్‌గా...

విప్లవోద్యమ విలువలతోనే  మంత్రిస్థాయికి: సీతక్క

  • ప్రజావ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడాలి: బీవీ రాఘవులు

  • ప్రధాన స్రవంతిలోని మావోయిస్టులు చెల్లాచెదురు కావొద్దు: కూనంనేని

  • తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఓంకార్‌ శతజయంతి సభ

హైదరాబాద్‌ సిటీ, మార్చి17(ఆంధ్రజ్యోతి): తాను ఈ స్థాయికి ఎదగడానికి విప్లవోద్యమంలో నేర్చుకున్న విలువలు, క్రమశిక్షణే ప్రధాన కారణమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నర్సంపేట ఏరియా దళకమాండర్‌గా తాను పనిచేస్తున్నపుడు ఎమ్మెల్యే ఓంకార్‌ ఔన్నత్యం గురించి స్థానికుల నోట విన్నట్లు చెప్పారు. తెలంగాణ సాయుధపోరాట యోధుడు, ఎంసీపీఐ(యు) వ్యవస్థాపక నేత ఓంకార్‌ శతజయంతి సందర్భంగా ఆ పార్టీ నేతృత్వంలో మంగళవారం ‘చట్టసభలలో ఓంకార్‌ పాత్ర’ అంశంపై రవీంద్రభారతిలో నిర్వహించిన సభలో సీతక్క మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులను వ్యతిరేకిస్తూ.. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలి.. అందుకు మంత్రి సీతక్క, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.. అని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. దీనికి వారిరువురూ సానుకూలంగా స్పందించారు. ప్రజావ్యతిరేక విధానాలను ఐక్యంగా అడ్డుకోవడానికి కమ్యూనిస్టు పార్టీలు సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టాలని రాఘవులు అభిలషించారు. ఈ సందర్భంగా ఓంకార్‌ చిత్రపటానికి వక్తలు పుష్పాంజలి ఘటించారు. అనంతరం బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ఓంకార్‌ శాసనసభ్యుడిగా 22 ఏళ్లు చట్టసభల్లో ప్రజాగళాన్ని వినిపించారన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ శాసనసభలో ఏకధాటిగా రెండున్నర గంటలు ప్రసంగించడంతో పాటు ‘భార్గవ కమిషన్‌’ ఏర్పాటులో ఆయనది ముఖ్యపాత్ర అన్నారు. ఆదివాసీలపై కేంద్రం చేస్తోన్న దాడులను వ్యతిరేకించడమే ఓంకార్‌కు నిజమైన నివాళి అన్నారు.

నర్సంపేటలో ఓంకార్‌ స్మారక విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి ఐదెకరాలు కేటాయించాల్సిందిగా మంత్రి సీతక్కను ఎంసీపీఐ(యూ) నేతలు కోరగా, ఆమేరకు సీతక్క హామీ ఇచ్చారు. ప్రధాన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు చెల్లాచెదురు కాకుండా వామపక్ష ఉద్యమాలకు కలిసి రావాలని ఎమ్మెల్యే కూనంనేని ఆకాంక్షించారు. అభిప్రాయ భేదాలతో చీలిపోయిన ఎంసీపీఐ(యు)ను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ పేర్కొన్నారు. అమెరికా సా మ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని నిరసిస్తున్నట్లు సభలో తీర్మానించారు. ప్రసంగించిన వారిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జస్టిస్‌ చంద్రకుమార్‌, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్రకార్యదర్శి సీహెచ్‌ మురహరి తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 04:39 AM