Share News

అంగన్వాడీలకు అల్పాహారం

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:57 AM

అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు సర్కారు త్వరలోనే తీపి కబురందించనున్నది. వారి ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీ కేంద్ర విద్యార్థులకు అల్ఫాహార పథకం...

అంగన్వాడీలకు అల్పాహారం

  • కొన్ని ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా బ్రేక్‌ఫాస్ట్‌

  • వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అమలు

  • డీడబ్ల్యూవోలతో సమీక్షలో స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు సర్కారు త్వరలోనే తీపి కబురందించనున్నది. వారి ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీ కేంద్ర విద్యార్థులకు అల్ఫాహార పథకం (బ్రేక్‌ఫాస్ట్‌ స్కీం) ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో జిల్లాల డీడబ్ల్యూవోలతో జరిగిన సమీక్షలో మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ చిన్నారుల్లో పోషకాహార లోపాలను శాశ్వతంగా నిర్మూలించి సంక్షేమంలో దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చి దిద్దాలని తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్నారులకు పంపిణీ చేసే బ్రేక్‌ఫాస్ట్‌ మిక్స్‌ను స్వయంగా రుచి చూసి పరిశీలించిన మంత్రి సీతక్క.. ఆ మిశ్రమం మరింత మృదువుగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించి.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్‌ సరఫరా, ప్రీ-స్కూల్‌ కార్యక్రమంతోపాటు పిల్లల హాజరు శాతాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆమె చెప్పారు. ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న 100 మి.లీ విజయ పాలు పంపిణీ, ఆదివాసీ ప్రాంతాల్లో కౌమార బాలికలకు పల్లీ, చిరుధాన్యాల చిక్కీల పంపిణీ ఆశించిన ఫలితాలనిస్తున్నాయన్న మంత్రి సీతక్క.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాల అమలుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట’ అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమాలతో అంగన్వాడీల్లో గణనీయంగా చిన్నారుల హాజరు శాతం పెరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు లేని చోట భవిష్యత్‌లో మొబైల్‌ అంగన్వాడీ కేంద్రాల సేవలను అందుబాటులోకి తెస్తామని మంత్రి సీతక్క వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అల్ఫాహార పథకం అమలు చేయడంతో 16.58 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. . అంగన్వాడీ భవనాల నిర్మాణంలో జాప్యం.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2,199 భవనాలు మాత్రమే మంజూరు చేస్తే ఇప్పటికీ 500 భవనాలే పూర్తి కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క.. యుద్ధ ప్రాతిపదికన మిగతా భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Feb 28 , 2026 | 03:57 AM