కేంద్ర నిధులు వినియోగించుకుందాం!
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:20 AM
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుందామని అధికారులకు పంచాయతీరాజ్...
పూర్తిగా ఖర్చుపెడితే అదనంగా 600 కోట్లు వస్తాయ్: సీతక్క
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుందామని అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సూచించారు. గురువారం సచివాలయంలో ఎన్‌ఆర్ ఈజీఎస్ అమలుపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై 1 నుంచి ‘వీబీజీ రాంజీ’ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ నెలలోపు ఉపాధి హామీ నిధులను పూర్తిస్థాయిలో వెచ్చించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రస్తుతం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.589 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని వాటిని పూర్తిస్థాయిలో ఖర్చుచేస్తే అదనంగా మరో రూ.600కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాల వారీగా స్పష్టమైన కార్యాచరణతో రూపాయి కూడా వెనక్కు వెళ్లకుండా అన్ని నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి ఇటీవల వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన మహిళా గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణ పనుల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, నిర్ణీత గడువులోపు కనీసం 50శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.