ప్రముఖుల భద్రతపై కీలక నిర్ణయం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:36 AM
ప్రముఖుల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో సుమారు 100 మంది ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను తొలగించింది.
100 మందికి భద్రత తొలగింపు
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వెనక్కి
హైదరాబాద్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ప్రముఖుల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో సుమారు 100 మంది ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను తొలగించింది. కొందరు ప్రముఖులకు భద్రతా కారణాల వల్ల ఇప్పటి వరకు సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్(బీపీ) వాహనాలను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు వారికి ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను పూర్తిగా తొలగించడంతోపాటు టూ ప్లస్ టూ భద్రతను కుదించింది. ఇటీవల భద్రతా కమిటీ సమావేశమై ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం మేరకు కొత్తగా ఎవరెవరికి భద్రత కల్పించాలి, ఎంత మేరకు కల్పించాలి అనేది నిర్ణయించింది. భద్రత అవసరంలేని మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ పోలీస్ ఉన్నతాధికారులకు గన్‌మెన్‌లను తొలగించింది. రాష్ట్రంలో వివిధ కేటగీరీల కింద సుమారు 600 మంది ప్రముఖులకు ఇంటెలిజెన్స్ విభాగం రక్షణ కల్పిస్తోంది. మరోవైపు రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు మావోయిస్టులు తప్ప ఎవరూ అజ్ఞాతంలో లేరు కాబట్టి చాలా మంది మాజీ పోలీసు అధికారులకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన అధికార, ప్రతిపక్షపార్టీల ప్రజాప్రతినిధులకు భద్రత తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.