లష్కర్‌లో 21 రోడ్లకు బ్రిటీషర్ల పేర్లు తొలగింపు
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:03 AM
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ది దేశ చరిత్రలోనే ప్రత్యేక స్థానం. అందులో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ)కి 200 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది.
వాటి స్థానంలో మన యుద్ధవీరులు, త్యాగధనుల పేర్లు
వెల్లింగ్టన్ రోడ్డుకు కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరు
బర్టన్ రోడ్డుకు కల్నల్ సంతోష్ బాబు పేరు
ప్యాట్నీ రోడ్డు ఇక ఏబీ తారాపూర్ రోడ్డు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిర్ణయం
అల్వాల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ది దేశ చరిత్రలోనే ప్రత్యేక స్థానం. అందులో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ)కి 200 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. ఇంతకాలంగా ఆంగ్లేయ పాలకుల పేర్లున్న ఆ ప్రాంత రోడ్లకు భారతదేశం కోసం అసువులు బాసిన అమరవీరులు, త్యాగధనులు, మహనీయుల పేర్లు పెడుతున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ ప్రకటించారు. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం తద్వారా వలసవాద ఛాయలకు తెరదించామని పేర్కొన్నారు. వెల్లింగ్టన్ రోడ్డుకు కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరు పెట్టారు. టిప్పు సుల్తాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత నెపోలియన్ బోనాపార్టేను ఓడించి ఇంగ్లండ్‌కు రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ పేరు బదులు ఆ రోడ్డుకు కార్గిల్ అమరవీరుడి పేరు పెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బర్టన్ రోడ్డుకు ఆరేళ్ల కిందట గాల్వాన్ ఘర్షణలో అసువులు బాసిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పేరు, పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలోని బోల్టన్ రోడ్డుకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టారు. నోబెల్ రోడ్డుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరు పెట్టగా, బ్యామ్ రోడ్డుకు పరమహంస మార్గ్ అని నామకరణం చేశారు. ముంబై ఉగ్రదాడిలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరును రిచర్డ్‌సన్ రోడ్డుకు, లెఫ్టినెంట్ కల్నల్ ఏబీ తారాపూర్ పేరు ప్యాట్నీ రోడ్డుకు పెడుతున్నారు. లిట్టన్ రోడ్డును నేతాజీ సుభా్‌షచంద్ర బోస్ రోడ్డుగా, కార్న్‌వాలిస్ రోడ్డును స్వామి వివేకానంద మార్గ్‌గా మారుస్తున్నారు. మొత్తం 21 రహదారులు, 3 బజార్లకు బ్రిటీష్ కాలం నాటి పేర్లను తొలగించనున్నారు. గౌహ్ రోడ్డుకు పరమవీర చక్ర సోమనాథ్ శర్మ పేరు పెడుతున్నారు. ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.