సికింద్రాబాద్‌లో 3వేల కిలోల కల్తీ పనీర్ పట్టివేత
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:24 AM
సికింద్రాబాద్‌లో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా.. కల్తీ పనీర్, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.
హైదరాబాద్ సిటీ/రామ్‌గోపాల్‌పేట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా.. కల్తీ పనీర్, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన ఆకస్మిక దాడుల్లో మొత్తం 3,892 కేజీల కల్తీ పాల ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.11లక్షల వరకు ఉంటుందని చెప్పారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు.. జీహెచ్‌ఎంసీ ఫుడ్ ేసఫ్టీ ఆఫీసర్ బి. సాహితితో కలిసి గంజ్ బజార్ ప్రాంతంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిందితులు నాణ్యత లేని, అపరిశుభ్రమైన పనీర్‌తో పాటు ఇతర పాల ఉత్పత్తులను సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది. వాటిని ‘విజయ మిల్క్ షాప్’, ‘బాలాజీ డైరీ ప్రొడక్ట్’ వంటి పేర్లతో నాణ్యమైన ఉత్పత్తులుగా నమ్మిస్తూ హోటల్, క్యాటరింగ్ సర్వీసులకు కిలో రూ.280 చొప్పున విక్రయిస్తున్నారు. నిందితులు జైపాల్ సింగ్ రాజ్‌పురోహిత్, కొలారియా వైభవ్, నరేష్ కొలారియా, ప్రేమ్ అనిల్ వ్యాస్, రామ్ కిషోర్ కొలారియా, లక్ష్మీనారాయణ కొలారియాలను అదుపులోకి తీసుక్నుట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు.