Minister Ponguleti Srinivas Reddy: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఏప్రిల్ నుంచి
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:13 AM
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, పేదలకు అందిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాజకీయాలకతీతంగా పేదలందరికీ ఇస్తాం
మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి
నీటి హక్కులపై రాజీ ప్రసక్తే లేదు: ఉత్తమ్
హుజూర్‌నగర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, పేదలకు అందిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రూ.23 వేల కోట్లతో 23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని చెప్పారు. రాజకీయాలకతీతంగా పేదలందరికీ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని ఫణిగిరి గట్టు వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ ఇళ్లను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం గులాబీ నేతలకు మాత్రమే ఇళ్లు ఇచ్చిందని ఆరోపించారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. పేదల కోసం ఇళ్లు కడితే కమీషన్లు రావనే ఆలోచనతోనే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి కమీషన్లు కొట్టేశారని ఆయన ఆరోపించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి జలాల నీటి హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. తెలంగాణ వాటా నీటి హక్కులపై కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కృష్ణా, గోదావరి జల్లాలో తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులపై చర్చించామని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్‌లు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు. తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో, బయట మాజీ మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ నాయకులే గత ప్రభుత్వ హయాంలో ఏపీతో అక్రమ ఒప్పందాలు చేసుకున్నారని ఆయన అన్నారు.