Share News

2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - May 16 , 2026 | 04:49 AM

రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని జూన్‌ 2న ఆదిలాబాద్‌ జిల్లా నుంచి శ్రీకారం చుడతామని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

  • ఆదిలాబాద్‌ జిల్లా నుంచి శ్రీకారం.. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు

  • ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా కేటాయింపులు

  • జాయింట్‌ సర్వేతోభూ వివాదాలకు పరిష్కారం: పొంగులేటి

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని జూన్‌ 2న ఆదిలాబాద్‌ జిల్లా నుంచి శ్రీకారం చుడతామని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను, ఐటీడీఏ ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అదనంగా ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలకు సంబంధించి శుక్రవారం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అంశాలపై హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం, ఎంపీలు వేం నరేందర్‌ రెడ్డి, బలరాం నాయక్‌ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. మొదటి విడతలో 3 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశామని, దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్‌ అయ్యాయని, ఇందులో 50 వేల గృహ ప్రవేశాలు కూడా జరిగాయని తెలిపారు. మరో రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవి మరో రెండు నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. ఇళ్ల మంజూరు పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామమని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించే వరకు మూడో విడత, నాలుగో విడత కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 20 వేల వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ పైలట్‌ గ్రామాల్లో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించిన వారికి బిల్లులను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పేదలు నివసిస్తున్న పూరిగుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అటవీ, సింగరేణి అధికారులు అడ్డుపడొద్దని సూచించారు. ఇళ్ల పునాది నిర్మాణానికి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుచెప్పొద్దని కలెక్టర్లకు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్థిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎక్కువమొత్తంలో అటవీభూములున్న ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలున్నాయని.. ఈ విభాగాలు జాయింట్‌ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పట్టా భూములు, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య కూడా వివాదాలున్నాయని ప్రభుత్వం ఇటీవల కొనుగోలుచేసిన రోవర్స్‌తో సర్వే నిర్వహించి భూ వివాదాలకు ముగింపుపలకాలని ఆదేశించారు.

Updated Date - May 16 , 2026 | 04:49 AM