Share News

ద్వితీయం అద్వితీయమే

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:15 AM

వైద్యులను సంప్రదిస్తున్నవారిలో చాలామంది ఇప్పుడు సెకండ్‌ ఒపీనియన్‌కు ఆసక్తి చూపుతున్నారు. చికిత్స గురించి వైద్యుడి సూచనలను రోగి గుడ్డిగా నమ్మడం లేదు.

ద్వితీయం అద్వితీయమే

  • వైద్య చికిత్స కోసం సెకండ్‌ ఒపీనియన్‌ ఎప్పుడూ మంచిదే

  • రోగుల్లో పెరుగుతున్న ఈ ధోరణి.. సందేహాలు, భయాలు పటాపంచలు

  • సెకండ్‌ ఒపీనియన్‌ కోసం కొన్ని ఆస్పత్రుల్లో ఉచిత కన్సల్టెన్సీలు

  • ఓ యువకుడికి కంట్లో ఎర్రటి చార చాలా పెద్దగా కనిపిస్తోంది. విపరీతమైన మంట, నొప్పి ఉండటంతో కంటి వైద్యురాలిని సంప్రదించాడు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని, లేకపోతే చూపు పోతుందని ఆమె చెప్పారు. భయపడ్డ ఆ అబ్బాయి మరో నేత్ర వైద్యురాలిని సంప్రదించాడు. సర్జరీ అవసరం లేదని, మందులతో తగ్గిపోతుందని ఆమె చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వైద్యులను సంప్రదిస్తున్నవారిలో చాలామంది ఇప్పుడు సెకండ్‌ ఒపీనియన్‌కు ఆసక్తి చూపుతున్నారు. చికిత్స గురించి వైద్యుడి సూచనలను రోగి గుడ్డిగా నమ్మడం లేదు. మరో వైద్యుడిని సంప్రదిస్తున్నాడు. కొందరైతే సెకండ్‌ ఒపీనియనే కాదు.. థర్డ్‌ ఒపీనియనూ తీసుకుంటున్నారు. ఆ తర్వాతే వైద్య చికిత్సపై నిర్ణయం తీసుకుంటున్నారు. రోగుల్లోని ఈ ధోరణిని వైద్యులు కూడా స్వాగతిస్తున్నారు కొన్నిసార్లు సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవాలని వైద్యులే చెబుతున్నారు. రోగులు, వారి కుటుంబసభ్యుల్లోని ఆసక్తిని గమనించి కొన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా సెకండ్‌ ఒపీనియన్‌ కోసం ఉచిత కన్సల్టేషన్‌ డ్రైవ్‌ను చేపడుతున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో గతంలో ఉచిత సెకండ్‌ ఒపీనియన్‌ కన్సల్టేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించారు. తాజాగా బేగంపేటలోని ‘విన్‌విజన్‌ ఐ’ ఆస్పత్రిలో రెండు నెలల నుంచి సెకండ్‌ ఒపీనియన్‌ ఉచిత కన్సల్టేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఇరవై మంది రోగులు సంప్రందించగా, వారిలో పది మందికి శస్త్రచికిత్స అవసరం లేదని నిర్ధారించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. చాలా మంది క్యాన్సర్‌, గర్బశాయ సంబంధ సమస్యలు, మోకాలి తుంటి మార్పిడి, కణుతులు తొలగించడం, నేత్ర సంబంఽఽధమైన ఇబ్బందులు, గుండె, న్యూరో సర్జరీలపై సెకండ్‌ ఒపీనియన్‌ కోసం ఆశ్రయిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కాగా సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవడం వల్ల రోగులకు ఒక భరోసా ఏర్పడుతుంది. తొలుత తాము సంప్రదించిన వైదద్యుడి అభిప్రాయాన్ని, రెండో వైద్యుడి అభిప్రాయాన్ని బేరీజు వేసుకుని ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఎప్పుడు తీసుకోవాలంటే..

పెద్ద శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చినప్పుడు, అరుదైన వ్యాధుల విషయంలో, క్యాన్సర్‌, గుండె, మెదడుకు సంబంధించిన వ్యాధులను గుర్తించినప్పుడు, మందులు వాడుతున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడనప్పుడు, వైద్య చికిత్సపై అనుమానాలు, సందేహాలు కలిగినప్పుడు సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సెకండ్‌ ఒపీనియన్‌ కోసం వెళ్లాల్సి వస్తే అన్ని వైద్య నివేదికలు, స్కాన్ల తాలూకు రిపోర్టులు, మందుల చీటీలు వెంట తీసుకెళ్లాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న నిపుణుడిని సంప్రదించడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సను ఆలస్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలి.


పెద్దాయనకు సర్జరీ తప్పింది

కొండాపూర్‌కు చెందిన 79 ఏళ్ల వ్యక్తి వెన్నెముక సమస్య కారణంగా లేచి నిల్చొనేందుకూ ఇబ్బంది పడుతున్నారు. చికిత్స కోసం ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి న్యూరో సర్జన్‌ వద్దను సంప్రదిస్తే స్పైన్‌ ఎంఆర్‌ఐ తీయించారు. ఆ రిపోర్ట్‌ను వైద్యుడు పరిశీలించి సమస్యేమీ లేదని, ఓసారి స్పైన్‌ సర్జన్‌ను సంప్రందించాలని సూచించారు. తర్వాత ఆయన మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన స్పైన్‌ సర్జన్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. సదరు వైద్యుడు ఆ రోగికి స్పైన్‌ ఎంఆర్‌ఐ చేయించాలని సూచించారు. ఇంతకుముందే చేయించామని, సమస్యేమీ లేదని అక్కడి వైద్యుడు చెప్పారని కుటుంబసభ్యులు చెప్పినా.. మరోసారి తీయించాల్సిందేనని ఆ వైద్యుడు చెప్పారు. దీంతో మళ్లీ బ్రెయిన్‌ ఎంఆర్‌ఐ చేయించి వైద్యుడికి చూయిస్తే పరిస్థితి బాగా లేదని, వెంటనే సర్జరీ చేయించాలని, లేదంటే సమస్య తీవ్రమవుతుందని, రేపే సర్జరీ చేస్తానని చెప్పారు. తాము ఆలోచించి చెబుతామనిరోగి కుటుంబసభ్యులు చెబితే ‘మీ ఇష్టం.. ఆలస్యం చేస్తే రోగికే ప్రమాదం. నేను పదివేల సర్జరీలు చేశాను. ఆ అనుభవంతోనే చెబుతున్నా’ అని ఆ వైద్యుడు గట్టిగా చెప్పేసరికి రోగి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకుగురయ్యారు. ఎంతకైనా మంచిదని ఆ మర్నాడు మరో కార్పొరేట్‌ ఆస్పత్రి స్పైన్‌ సర్జన్‌ వద్దకు రోగిని తీసుకెళ్లారు. ఆయన రిపోర్టులన్నీ పరిశీలించి శస్త్రచికిత్స అవసరం లేదని, స్పైన్‌ వద్ద ఇంజక్షన్‌ ఇస్తే సరిపోతుందని, మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. అప్పటిదాకా తీవ్ర ఆందోళనతో ఉన్న ఆ రోగికి వైద్యుడి మాటలు గొప్ప ఊరటనిచ్చాయి. ఆ వైద్యుడు చెప్పినట్లుగానే శస్త్రచికిత్స లేకుండా మందులతోనే ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నారు.

5.jpg

..తప్పులేదు

సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవడంలో తప్పులేదు. దీని వల్ల ఒక స్పష్టత ఏర్పడుతుంది. శస్త్రచికిత్స అంటే చాలామంది భయపడుతుంటారు. సాధారణంగా మందులతో సరిపెట్టుకుందామనుకున్న వాళ్ళు సర్జరీ అనే సరికి భయం, ఆందోళనకు గురవుతుంటారు. సర్జరీ అవసరం లేదేమోననే సందేహం వచ్చినప్పుడు మరో వైద్య నిపుణుడిని సంప్రందించి సలహాలు తీసుకోవొచ్చు. కంటి శస్త్రచికిత్స సమయంలో భయాలుంటే మరో వైద్యుడి సలహా తీసుకోవడంలో తప్పు లేదు. దీని వల్ల వైద్య చికిత్సపై స్పష్టత వస్తుంది. రోగుల్లో భయం పోతుంది.

- డాక్టర్‌ శ్రీలక్ష్మి నిమ్మగడ్డ, చీఫ్‌ అఫ్తామాలజిస్టు

3.jpg

మొదటి డాక్టర్‌పై నమ్మకం ఏర్పడుతుంది

సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవడం మేలే చేస్తుంది. వైద్య చికిత్సపై అందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు. ఒకే సమస్యపై ఒక్కో వైద్యుడు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. దానికి అనుగుణంగా పరిష్కారాలు వెదుకుతారు. కొందరు పెద్ద సమస్య ఉన్నా తేలికైన చికిత్సతో పరిష్కారం చూపుతారు. సెకండ్‌ ఓపినియన్‌ తీసుకోవడం వల్ల ఇద్దరు వైద్యులు అభిప్రాయం ఒకే విధంగా ఉంటే మొదటి డాక్టర్‌పై మరింత నమ్మకం ఏర్పడుతుంది.

- డాక్టర్‌ కల్యాణ్‌ కుమార్‌ వర్మ, సీనియర్‌ స్పైన్‌ సర్జన్‌

4.jpg

రోగిని ప్రొత్సహించాలి

మరోక వైద్యుడిని అభిప్రాయం తీసుకుంటానని రోగి చెబితే దాన్ని మొదటి వైద్యుడు ప్రోత్సహించాలి. దీనివల్ల వైద్యులపై నమ్మకం మరింత పెరుగుతుంది. రోగికి కూడా అనుమానాలు నివృత్తి అవుతాయి. స్టెంట్‌ వేసే సమయంలో సర్జన్ల సలహాలు కూడా మేం తీసుకుంటాం. రోగులు కూడా సెకండ్‌ ఒపీనియన్‌ తీసకోవడంలో తప్పులేదు. రెండో అభిప్రాయం తీసుకోవడంలో నిపుణులైన వారిని సంప్రందించడం మంచిది.

- డాక్టర్‌ శివ ప్రసాద్‌, చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు

Updated Date - Jul 05 , 2026 | 05:15 AM