Share News

బాబోయ్‌ ఎండలు!!

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:41 AM

రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మార్చి మొదటి వారంలోనే వేసవి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం నుంచే మొదలవుతున్న సూర్య ప్రతాపం మధ్యాహ్నానికి హడలెత్తిస్తోంది.

బాబోయ్‌ ఎండలు!!

  • మార్చి తొలివారంలోనే హడలెత్తిస్తున్న సూర్యుడు

  • ములుగు జిల్లాలో శుక్రవారం అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత

  • హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో 37.8

  • రాబోయే 3 రోజుల్లో మరింత పెరగనున్న తీవ్రత

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/యాదాద్రి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మార్చి మొదటి వారంలోనే వేసవి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం నుంచే మొదలవుతున్న సూర్య ప్రతాపం మధ్యాహ్నానికి హడలెత్తిస్తోంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు ఉక్కపోత కూడా మొదలైంది. ఇప్పటికే ఎండల మంట తీవ్రంగా ఉండగా రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని అప్రమత్తం చేసింది. శని, ఆదివారాలకు ఎండ తీవ్రతకు సంబంధించి ఎల్లో అలెర్ట్‌ కూడా జారీ చేసింది. ఇక, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 37 డిగ్రీలకు పైగానే పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో మంగపేట మండలం మల్లూరులో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 38.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో 37.8, మెహిదీపట్నంలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత ఇదే తరహాలో కొనసాగితే వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 04:41 AM