భూసారం కోసం శాస్త్రీయ పద్ధతులు
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:42 AM
భూసారాన్ని కాపాడేందుకు రైతులు శాస్ర్తీయ పద్ధతులు అవలంబించాలని జిల్లా ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ నివేదిత అన్నారు.
కోదాడ రూరల్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): భూసారాన్ని కాపాడేందుకు రైతులు శాస్ర్తీయ పద్ధతులు అవలంబించాలని జిల్లా ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ నివేదిత అన్నారు. మండలంలోని అల్వాలపురం రైతు వేదికలో గురువారం డివిజన్, మండల స్థాయి(ఆత్మ) ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయంపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువులు అధికంగా వినియోగిస్తే భూసారం క్షీణిస్తుందన్నారు. రైతులు శాస్త్రవేత్తలు సూచించిన విధంగా దఫాల వారీగా ఎరువులు వినియోగించాలని సూచించారు. భూమిలో సేంద్రియ కర్భనం పెంచేందుకు ప్రధాన పంటల సాగుకుముందు పచ్చిరొట్ట ఎరువులను సాగుచేసి, కలియ దున్నడం ద్వారా భూసారం మెరుగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పాలెం రజనీ, నియోజకవర్గ ఆత్మ చైర్మన్ బుడిగం లింగయ్య, ఆత్మ డైరెక్టర్లు, కోరమాండల్ సంస్థ అధికారులు, సాంకేతిక వ్యవసాయ అధికారి దేవప్రసాద్, విస్తరణాధికారులు నగేశ్, ఝాన్సీ, వినోద్, సల్మా తదితరులు పాల్గొన్నారు.