College Bus Accident: కల్వర్టును ఢీకొట్టి.. కాల్వలోకి స్కూల్ బస్సు
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:24 AM
ఖమ్మం జిల్లాలో స్కూలు బస్సు, కొత్తగూడెం జిల్లాలో కాలేజీ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురయ్యాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానంద హై స్కూల్‌కు చెందిన బస్సు పెనుబల్లి ....
ప్రమాద సమయంలో బస్సులో 107మంది విద్యార్థులు
డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే కారణం
20 మందికి స్వల్పగాయాలు.. ఖమ్మం జిల్లాలో ఘటన
పెనుబల్లి/వేంసూరు, అశ్వాపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో స్కూలు బస్సు, కొత్తగూడెం జిల్లాలో కాలేజీ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురయ్యాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానంద హై స్కూల్‌కు చెందిన బస్సు పెనుబల్లి మండలం గణే్‌షపాడు గ్రామసమీపంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కాల్వలో బోల్తాపడింది. కాల్వలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 107మంది విద్యార్థులు ఉండగా 20మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి, సత్తుపల్లి, వేంసూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ ఆళ్ల నవీన్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు బాధ్యులను చేస్తూ పాఠశాల యజమాని దేశిరెడ్డి నాగేందర్‌రెడ్డి, డ్రైవర్ నవీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకోగా.. డ్రైవర్ నవీన్ పరారీలో ఉన్నాడు. కాగా స్టీరింగ్ లాక్ కావడంతో ఓ కాలేజీ బస్సు అదుపు తప్పి కల్వర్టు పై నుంచి వాగు ఒడ్డున పల్టీ కొట్టింది. ఆ వాగులో నీరు లేకపోవడంతో విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కేఎల్‌ఆర్ విద్యా సంస్థల బస్సు మణుగూరు నుంచి 40 మంది విద్యార్థులను ఎక్కించుకుని పాల్వంచలోని కళాశాలకు వెళుతోంది. అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలోని పాలవాగు సమీపంలో బస్సు స్టీరింగ్ లాక్ కావటంతో అదుపుతప్పి కల్వర్టు పైనుంచి వాగు ఒడ్డున పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మణుగూరుకు చెందిన విద్యార్థిని అంబికతో పాటు మరో విద్యార్థి అజయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. మరో 30 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.