Tourist Spots: వనదేవతల దర్శనం.. పర్యాటక ఆహ్లాదం!
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:25 AM
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు వనదేవతల దర్శనంతో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతాలనూ చుట్టిరావచ్చు. ప్రకృతి ప్రేమికులకు ములుగు జిల్లా స్వర్గధామం అంటే అతిశయోక్తి కాదు.
హాట్ ఫేవరెట్‌గా బ్లాక్‌బెర్రీ ఐలాండ్
తాడ్వాయి అడవుల్లో శాండ్ బీచ్
కొండల నడుమ లక్నవరం సరస్సులో విహారం
ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతాలెన్నో..
ములుగు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు వనదేవతల దర్శనంతో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతాలనూ చుట్టిరావచ్చు. ప్రకృతి ప్రేమికులకు ములుగు జిల్లా స్వర్గధామం అంటే అతిశయోక్తి కాదు. పచ్చని అడవులు, జలాశయాలు, ప్రకృతి సౌందర్యం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తా యి. ప్రధానంగా తాడ్వాయి అడవుల్లోని బ్లాక్ బెర్రీ ఐలాండ్, గోవిందరావుపేట మండలంలో కాకతీయ రాజులు కొండ ల మధ్య నిర్మించిన లక్నవరం సరస్సు పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. తాడ్వాయి అడవుల మధ్య జలగలంచ వాగు ఒడ్డున ఐదెకరాల విస్తీర్ణంలో పూర్తిగా ఇసుక మేటలపై ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ టూరిస్టులకు హాట్ ఫేవరెట్‌గా మా రింది. దట్టమైన అడవి మధ్య ఇసుక తెన్నెలు, వాగు ప్రవాహాన్ని చూస్తే బీచ్‌ను తలపిస్తుంది. దాని చుట్టూ ఉన్న చెట్లను చూస్తే అమెజాన్ అడవులను చూసిన అనుభూతి కలుగుతుంది. రాత్రివేళ క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం, టెంట్ స్టేలో బస చేయడం పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతుల్ని మిగులుస్తాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది ప్రారంభమైన ఈ ఐలాండ్ మొదట్లో నిర్లక్ష్యానికి గురైంది. మంత్రి సీతక్క చొరవతో ఇప్పుడు మరమ్మతులకు నోచుకొని కొత్తకళను సంతరించుకుంది. వరంగల్ నుంచి సుమారు 80 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
లక్నవరం కొండల నడుమ జలకళ..
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు ములుగు జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. కొండల నడుమ విస్తరించిన సరస్సు, అందమైన దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయి. జోడు వంతెనలు, సరస్సు మధ్యలో ఉన్న ద్వీపాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు ఐలాండ్లలోని కాటేజీల్లో బస చేసేందుకు పర్యాటకులు ఇష్టపడతారు. వరంగల్ నుంచి సుమారు 70 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పర్యాటక ప్రాంతం ప్రకృతి సౌందర్యాలకు నిలయంగా ఉంది.
ఊటీకి దీటుగా ములుగు అందాలు..
ములుగు జిల్లాలో తాడ్వాయి అడవులు, జలగలంచ వ్యూ పాయింట్, లక్నవరం సరస్సు, బొగత జలపాతం వంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇవి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎటుచూసినా పచ్చదనంతో ఊటీ అందాలను తలపిస్తున్నాయి. బ్లాక్‌బెర్రీ ఐలాండ్, సఫారీ రైడింగ్, ఏటూరునాగారం అభయారణ్యం అద్భుతంగా ఉంటాయి. వీటితో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ జిల్లాలోనే ఉన్నాయి.