Share News

kumaram bheem asifabad- నిధులు కరువు.. నిర్వహణ బరువు

ABN , Publish Date - Aug 09 , 2026 | 10:27 PM

అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది కానీ నిర్వహణకు నెలనెలా డబ్బులు ఇవ్వడం లేదు.

kumaram bheem asifabad- నిధులు కరువు.. నిర్వహణ బరువు
లోగో

జైనూర్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది కానీ నిర్వహణకు నెలనెలా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో కనీసం విద్యుత్‌ చార్జీలు చెల్లించే పరిస్థితి లేదు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, పంటల సాగులో వారికి అవసరమయ్యే సలహాలు, సూచనలు ఇవ్వడానికి 2021లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్లస్టర్ల వారిగా రైతు వేదిక లకు నిర్మించారు. ఒక్కో రైతువేదికకు రూ.22లక్షలతో నిర్మించారు. ఒక్కో వేదికకు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. వారు రోజు ఉదయం, సాయంత్రం వేదికల్లో అన్నదాతలకు అందుబాటులో ఉంటూ మిగితా సమయాల్లో క్షేత్ర సందర్శన చేసి కర్షకులకు సలహాలు, సూచనలు అందించాల్సి ఉంటుంది. వ్యవసాయ అఽధికారులు రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వేదికలో వసతి కల్పించారు. ప్రత్యేకంగా ఫర్నిచర్‌ను సమకూర్చారు. శిక్షణ కార్యక్రమాలకు అవసరమైన కుర్చీలు, మైకు వంటివి ఏర్పాటు చేశారు. వీటిని వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలు కూడా వినియోగించుకున్నాయి. ఊరికి దూరంగా నిర్మించిన వీటిలో పారిశుధ్య తదితర పనులకు సహాయకుడిని నియమిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట మరిచిపోయింది. రైతువేదికల్లోని విలు వైన సామగ్రి దొంగలపాలవుతుండడంతో వ్యవసా య విస్తరణ అధికారులే తమ స్వంత ఖర్చుతో వాచ్‌మెన్లను నియమించుకున్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతం వాటి నిర్వహణ గాలికొదిలేసింది.

- నిర్వహణ ఖర్చుల నిమిత్తం..

రైతువేదికల్లో మంచినీరు, విద్యుత్‌, పారిశుధ్యం వంటి నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతీ నెల రూ.9వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాలుగేళ్లుగా నిధులు విడుదల చేయకపోవ డంతో పలు ప్రాంతాల్లో సంబధిత అధికారులు కొందరు వారి వేతనం నుంచి నెల ఖర్చులు చెల్లించారు. 2022ఏప్రిల్‌ నుంచి 2022ఆగస్టు వరకు ఐదు నెలలకుగాను ఒక్కో రైతువేదికలకు గాను రూ.45వేలు అందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిధులే లేవు. జిల్లాలో 70రైతువేదికలు ఉండగా కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం రూ. 2.70లక్షలు బకాయి పడినట్లు లెక్క. గత ప్రభుత్వంలో చేసిన పనికి డబ్బులు ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తుందన్న ఆశ ఎలాగూ లేదు. కనీసం నెలవారి ఖర్చులైనా నెలనెలా ఇవ్వకపోవడంతో రైతువేదికల నిర్వహణ గాడితప్పి లక్ష్యం నీరుగారిపోతుంది.

- గత్యంతరం లేని..

నిధులు రాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యవసాయ విస్తరణ అధికారులే సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వ పరంగా ఎలాంటి స్పందన లేదు. విద్యుత్‌ చార్జీలకు రూ.1000, స్టేషనరీ జిరాక్స్‌లకు రూ.1000, శిక్షణా కాకర్యక్రమాలకు రూ.2500, తాగునీటి కోసం రూ.500, పరిశుభ్రత, కాపలాదారు కోసం రూ.3000 ప్రతీ నెలా ఖర్చవు తున్నాయి. కరెంట్‌ బిల్లుల విషయంలో మరీ ఒత్తిడి పెరుగుతోంది. సకాలంలో బిల్లు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారని, దీంతో విధి లేని పరిస్థితుల్లో తామే డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. కనీసం మరుగుదొడ్ల నిర్వహణకు కూడా నిధులు లేవని అన్నీ తామే భరించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. అధికారులకు ఈ విషయం చెబితే ప్రభుత్వం నుంచి నిధులు రావ డం లేదని మీరే భరించుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మోయలేని భారంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 10:27 PM