Share News

Jayashankar Agriculture University: గోవా టూర్లు.. లిక్కర్‌ దావత్‌లు!

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:08 AM

యశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పేపర్‌ లీకేజీ వెనక అసలు బాగోతం బయటపడింది...

Jayashankar Agriculture University: గోవా టూర్లు.. లిక్కర్‌ దావత్‌లు!

  • అగ్రి వర్సిటీ పేపర్‌ లీకేజీ వెనక అసలు బాగోతం

  • ఇన్‌సర్వీ్‌స ఏఈవోలతో ప్రొఫెసర్ల చెట్టాపట్టాల్‌..

  • పేపర్‌ లీకేజీకి యేటా చేతులు మారుతున్న రూ.లక్షలు

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పేపర్‌ లీకేజీ వెనక అసలు బాగోతం బయటపడింది. అచార్యులు, విద్యార్థుల మధ్య వయసు అంతరం పెద్దగా లేకపోవడంతో.. ప్రొఫెసర్లను గోవా ట్రిప్పులకు తీసుకెళ్తూ, మద్యం, మాంసంతో విందులిస్తూ విద్యార్థులు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అగ్రికల్చర్‌ బీఎస్సీ పరీక్షల్లో అక్రమాల తంతు కేవలం ఈ ఒక్క ఏడాదికే పరిమితం కాలేదు. 2017 నుంచి మొదలైంది. అప్పటివరకు వర్సిటీ సీట్లలో కేవలం ఒక శాతం సీట్లను మాత్రమే ఇన్‌ సర్వీస్‌ కోటాకు కేటాయించే వారు. దాంతో ఏడాదికి ఒకరిద్దరు మాత్రమే ఇన్‌ సర్వీస్‌ అగ్రికల్చర్‌ బీఎస్సీ కోర్సులో చేరే వారు. కానీ 2017 నుంచి ఈ కోటాను 3 శాతానికి పెంచారు. ఆ తర్వాత 2021లో 5 శాతానికి పెంచారు. అంతటితో ఆగకుండా వయో పరిమితిని కూడా పెంచారు. 2017 వరకు 35 ఏళ్లుగా ఉన్న వయోపరిమితిని 2017 నుంచి 45 ఏళ్లకు పెంచారు. దీంతో ఆశావహులు, ఇన్‌సర్వీ్‌స అగ్రికల్చర్‌ బీఎస్సీ అర్హుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్‌సర్వీ్‌స కోటా శాతం, వయోపరిమితి పెంచే విషయంలో కూడా అప్పటి వర్సిటీ అధికారుల సొంత ప్రయోజనాలున్నాయని చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పటి సర్కారు పట్టించుకోలేదు. 2018లో 7, 2019లో 21, 2020లో 22, 2021లో 22, 2023లో 22, 2024లో 34 మంది ఇన్‌సర్వీ్‌స బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సును పూర్తిచేశారు. ఈ ఏడాది కూడా 34 మంది ఉండగా... పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో తాజాగా డిస్మిస్‌ చేసిన సంగతి తెలిసిందే..


ఒకరోజు ముందే వాట్సా్‌పలో ప్రశ్నపత్రాలు..

జయశంకర్‌ యూనివర్సిటీ పరిధిలో వరంగల్‌, అశ్వారావుపేట, జగిత్యాల, పాలెం, సిరిసిల్ల, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌లో.. 7 వ్యవసాయ కళాశాలలున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాగానే ఇన్‌సర్వీ్‌స విద్యార్థులతో అంతర్గత సమావేశాలు నిర్వహించి, వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయటం, సెమిస్టర్లు, ప్రశ్నపత్రాల వారీగా డబ్బులు మాట్లాడుకొని పేపర్లు లీక్‌ చేస్తున్నారు. పరీక్షలకు ఒకరోజు ముందు ప్రొఫెసర్ల చేతికి ప్రశ్నపత్రాలు వస్తాయి. ఓటీపీ కూడా వారికే ఇస్తారు. దీంతో ల్యాబ్‌ టెక్నీషియన్లతో జిరాక్సులు తీయిస్తారు. అదే రోజు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి ఇన్‌సర్వీ్‌స అగ్రి బీఎస్సీ విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపులో వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కఠినంగా ఉండే సబ్జెక్టులైన పాథాలజీ, సాయిల్‌ సైన్స్‌, బ్రీడింగ్‌, బయో కెమిస్ట్రీ, ఎంటమాలజీలో కూడా వీరికి అత్యధిక మార్కులు వస్తున్నాయి. ఈసారి ఏఐ టెక్నాలజీ ఆధారిత పెన్నుల్లో జవాబులు నిక్షిప్తం చేసుకొని వాటితోనే పరీక్ష రాశారు. ఇక 2017 నుంచి అక్రమాలు జరుగుతున్నా.. గడిచిన మూడేళ్లలో పక్కాగా జరిగినట్లు వర్సిటీ అధికారులకు ఆధారాలు లభించాయి.

ఆచార్యులు, విద్యార్థులంతా కలిసే..

వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది, ఇన్‌సర్వీ్‌స బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థులు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ పరీక్షల్లో అక్రమాలకు తెరతీయడం.. గోవా ట్రిప్పులు, వీలైనప్పుడల్లా మద్యం, మాంసం విందులు చేసుకుంటుండటం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన ఇన్‌సర్వీ్‌స ఏఈవోలు గోవాలో విహరించినట్లు అధికారుల విచారణలో కూడా తేలినట్లు సమాచారం. అదే క్రమంలో ఒక్కో ప్రశ్నపత్రం లీక్‌ చేసినందుకు రూ.లక్ష రూపాయలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కళాశాలల వారీగా అదే బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు పంపించే క్రమంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయి. తాజాగా చేపట్టిన విచారణలో వరంగల్‌ కళాశాలకు చెందిన ఒక విద్యార్థి బ్యాంకు ఖాతా నుంచి రూ.12 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా వరంగల్‌, జగిత్యాల వ్యవసాయ కాలేజీల కేంద్రంగా పేపర్‌ లీకేజీలు జరిగాయి.


సర్కారుకు భారంగా ఇన్‌సర్వీ్‌స విద్యార్థులు

ఇన్‌సర్వీ్‌స ఏఈవోలు బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు చదవటానికి ప్రభుత్వమే ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ఏఈవోలుగా పనిచేస్తున్నవారికి ఏవోలుగా పదోన్నతి కల్పించటానికి ఇన్‌సర్వీ్‌స అగ్రి బీఎస్సీ కోర్సు తప్పనిసరి చేయటంతో దీనికి డిమాండ్‌ పెరిగింది. ఇన్‌సర్వీ్‌స వారికి ఎలాంటి ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్‌ లేకుండానే సీనియారిటీ ప్రాతిపదికన రూ.35 లక్షల విలువ చేసే సీటును ఉచితంగా కేటాయిస్తున్నారు. ఇటు ఇన్‌సర్వీ్‌స ఏఈవోలకు నెలకు రూ.లక్ష వేతనం అందుతుంది. ఇలా నాలుగేళ్లకు రూ.48 లక్షలు ప్రభుత్వం వేతనంగా చెల్లిస్తోంది. మరోవైపు.. చదువుకోవటానికి వెళ్లిన ఏఈవో స్థానంలో ఔట్‌సోర్సింగ్‌పై ఏఈవోలను నియమిస్తున్నారు. వీరికి నెలకు రూ.25 వేలు శాఖ చెలిస్తారు. ఇలా ఒక్కో ఇన్‌సర్వీ్‌స ఏఈవోపై రూ.కోటి వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని గ్రాడ్యుయేట్‌ ఏఈవోల అసోసియేషన్‌ వెల్లడించింది. ఇన్‌సర్వీ్‌స అగ్రికల్చర్‌ బీఎస్సీ వ్యవస్థను రద్దు చేయాలని ఏఈవోల యూనియన్‌ నేతలు యాదగిరి, నవీన్‌, సుమన్‌, రాజ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 10 , 2026 | 05:08 AM