Share News

ఎస్‌బీఐ రాజీ

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:52 AM

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఐదెకరాల భూమి అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) మధ్య రేగిన వివాదం సద్దుమణిగింది.

ఎస్‌బీఐ రాజీ

  • రాయదుర్గం భూమికి ప్రత్యామ్నాయంగా మరో స్థలం తీసుకునేందుకు సిద్ధం

  • హైకోర్టులో కేసు ఉపసంహరణకు ఆమోదం

  • సీఎస్‌తో ఎస్‌బీఐ ఉన్నతాధికారుల భేటీవిజయవంతం.. ముగిసిన వివాదం

హైదరాబాద్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఐదెకరాల భూమి అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) మధ్య రేగిన వివాదం సద్దుమణిగింది. ఎస్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వంతో రాజీకి వచ్చింది. రాయదుర్గం భూమికి బదులుగా ప్రభుత్వం మరో చోట ఇచ్చే భూమిని తీసుకునేందుకు, భూవివాదంలో హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకునేందుకు ఎస్‌బీఐ అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, టీజీఐఐసీ ఎండీ శశాంకలతో ఎస్‌బీఐ ఉన్నతస్థాయి ప్రతినిధులు జీఎస్‌ రాణా, నీలేష్‌ ద్వివేదీ రాష్ట్ర సచివాలయంలో శనివారం మరోసారి సమావేశమయ్యారు. కాగా, రాయదుర్గంలోని ఐదు ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఎస్‌బీఐ అంగీకరించిందని సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో 2.5 ఎకరాలు లేదా ఉస్మాన్‌నగర్‌లో 2.5 ఎకరాలు లేదా భారత్‌ ఫ్యూ చర్‌ సిటీలో 10-15ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీనికి అంగీకారం తెలిపిన ఎస్‌బీఐ ప్రతినిధులు.. బోర్డు ఆమోదం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. హైకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటామని వెల్లడించారు. నిజానికి, గతంలో తాము కేటాయించిన 5ఎకరాలకు ప్రత్యామ్నాయంగా వేరేచోట భూములు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం గత నెలలోనే ఎస్‌బీఐకి తెలిపింది. ఎస్‌బీఐ ప్రతినిధులు మే12న ప్రత్యామ్నాయ భూములను సందర్శించి సానుకూలంగా స్పందించారు. కానీ, ఉన్నతాధికారులు అంగీకరించడం లేదన్న కారణంతో నిర్ణయం మార్చుకుంది. రాయదుర్గంలోని సదరు భూములను ప్రభుత్వం వేలం వేయగా ఎకరాకు రూ.237 కోట్ల ధర పలికింది. ఆ తర్వాత సదరు భూములు తమవేనంటూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఎస్‌బీఐ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎస్‌బీఐకి ఇచ్చిన లీడ్‌ బ్యాంకు హోదాను, ఆ బ్యాంకులోని తమ ఖాతాలు, డిపాజిట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీంతో ఎస్‌బీఐ దిగివచ్చింది.

Updated Date - Jun 28 , 2026 | 03:52 AM