మాకు అమ్మిన భూమిని ఎలా వేలం వేస్తారు?
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:13 AM
రాయదుర్గంలో ఇటీవల ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన 6.29 ఎకరాల భూమిలో ఐదెకరాలు తమవేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించింది.
ఎకరం రూ.237 కోట్లు పలికిన రాయదుర్గం భూముల్లోని ఐదు ఎకరాలు మావే
2010లో 13.33 కోట్లకు
ప్రభుత్వం మాకు విక్రయించింది
భూమి మా పొజిషన్‌లోనే.. అభివృద్ధికి కోట్లు ఖర్చు చేశాం
అక్కడ మా ఆఫీసుల కోసం ట్విన్ టవర్లు ప్రతిపాదించాం
ఫ్లైఓవర్లు, కొవిడ్‌తో పాటు అనుమతుల్లో ఆలస్యంతో జాప్యం
గతంలో కూడా అప్పటి ప్రభుత్వం ఈ భూమిపై కన్నేసింది
నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది
ఇప్పుడు వేలం వేయడంకోర్టు ధిక్కరణే అవుతుంది
హైకోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ
నేడు విచారించనున్న కోర్టు
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాయదుర్గంలో ఇటీవల ఎకరం రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన 6.29 ఎకరాల భూమిలో ఐదెకరాలు తమవేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించింది. వేలం ఆపాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు మొత్తం మూడు వేర్వేరు పిటిషన్లు వేసింది. ఇవి గురువారం జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి. ఆ భూమి తమదేనని ఎస్బీఐ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సర్వే నం. 83/1లో ఐదెకరాల ప్లాటు (20,239 చదరపు మీటర్లు) ప్లాట్ నెంబర్ 1(ఏ)ను వేలానికి పెట్టడంపై ఎస్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు భూమిని వేలంలో దక్కించుకున్న గౌరా వెంచర్స్‌కు ఎలాంటి హక్కులు లభించవని పిటిషన్‌లో పేర్కొంది. సదరు ఐదెకరాలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తమకు విక్రయించిందని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2010లోనే రూ.13.33 కోట్లకు వాటిని కొనుగోలు చేసినట్లు తెలిపింది. అప్పుడు ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో తిరిగి భూమిని తీసుకునేలా ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. ఇటీవల మే 20న సదరు భూమిలో నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు లెటర్ జారీ చేశారని, అది తమకు అందలేదని తెలిపింది. నిర్మాణాలు పూర్తిచేయడానికి మరింత సమయం ఇవ్వాలని కోరినా తిరస్కరించారని పేర్కొంది.
తాము ఇచ్చిన ఆధారాలు, రికార్డులతో పాటు హైకోర్టు తీర్పులను పరిశీలించకుండా ఏకపక్షంగా రాష్ట్ర పభుత్వం, టీజీఐఐసీ నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపింది. ఆ భూమిలో ఎస్బీఐ కార్పొరేట్ కార్యాలయాలు, శాఖలు, ఇతర కార్యాలయాల కోసం ట్విన్ టవర్ భవనాన్ని ప్రతిపాదించామని పేర్కొంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు, మార్గదర్శకాల ప్రకారం టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్లు రావడం, కొవిడ్ మహమ్మారి, జీహెచ్‌ఎంసీ వంటి ప్రభుత్వ సంస్థల అనుమతుల్లో ఆలస్యంతో నిర్మాణాలు కొంత జాప్యమైనట్లు పేర్కొంది. తమతో పోలిస్తే అక్కడ భూమి పొందిన ఇతర ఏ సంస్థలు అసలు నిర్మాణాలే ప్రారంభించలేదని పేర్కొంది. అక్కడ ఎవరికీ కేటాయించని ప్లాట్లు ఉన్నాయని, వాటిని వదిలేసి తమకు విక్రయించిన భూమిని వేలం వేయడం ఏంటని ప్రశ్నించింది. అధికారం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కులను కాలరాయలేదని, చట్టాన్ని ఉల్లంఘించలేదని పేర్కొంది. కోర్టుల న్యాయసమీక్ష అధికారం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని వ్యాఖ్యానించింది.
హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది
తమకు కేటాయించిన ఈ భూమిపై ప్రభుత్వం గతంలోనే కన్నేసిందని, నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకోవడంతోపాటు కేటాయింపు రద్దు చేయాలని చూసిందని ఎస్బీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. 2021లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హైకోర్టు 2022లో కొట్టేసిందని తెలిపింది. మరోసారి సైతం కేటాయింపు రద్దు చేయాలని ప్రభుత్వం చూసిందని, అయితే 2024లో తన పిటిషన్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకుందని గుర్తుచేసింది. మళ్లీ మూడోసారి రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీలు సదరు భూమిని వేలానికి పెట్టడం అక్రమమే కాకుండా చట్టవ్యతిరేకమైన ఏకపక్ష చర్య అని, కోర్టు ఉత్తర్వుల ధిక్కరణకు పాల్పడటమేనని తెలిపింది. వాస్తవానికి ఈ భూమి కేటాయింపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)కు జరిగిందని, ఆ సంస్థ ఎస్బీఐలో విలీనమైందని పేర్కొంది. 2011లో విక్రయ ఒప్పందం జరిగిన రోజే సదరు భూమిని స్వయంగా ప్రభుత్వమే తమకు అప్పగించిందని తెలిపింది. అక్కడ తలపెట్టిన ట్విన్ టవర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.21.50 కోట్లు అభివృద్ధి, ప్రహరీ, ఇతర చార్జీలు, ఫీజుల కోసం ఖర్చు పెట్టినట్లు వివరించింది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైందని, అన్ని అనుమతులు చూపించినా తదుపరి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం అక్రమంగా వేలం నోటీసు జారీ చేసిందని పేర్కొంది.