Share News

బ్యాంకు ఎదుట వంటలు.. బ్యాంకు లోపల భోజనాలు

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:10 AM

బ్యాంకులో గోల్డ్‌లోన్‌ తీసుకుని మోసపోయిన బాధితులు బ్యాంకు అధికారుల వైఖరికి నిరసనగా బ్యాంకు ఎదుట రెండు రోజులుగా దీక్షలు చేపట్టారు.

బ్యాంకు ఎదుట వంటలు.. బ్యాంకు లోపల భోజనాలు

  • గోల్డ్‌లోన్‌ బాధితుల వినూత్న నిరసన

చెన్నూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులో గోల్డ్‌లోన్‌ తీసుకుని మోసపోయిన బాధితులు బ్యాంకు అధికారుల వైఖరికి నిరసనగా బ్యాంకు ఎదుట రెండు రోజులుగా దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం బ్యాంకు ఎదుట వంటావార్పు నిర్వహించి బ్యాంకు లోపల భోజనాలు చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణంలోని ఎస్‌బీఐ బ్రాంచి- 2లో జరిగింది. ఈ బ్యాంకులో చెన్నూర్‌ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ఖాతాదారులు తమ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అవసరం మేరకు గోల్డ్‌లోన్‌ తీసుకున్నారు. కాగా, గత ఏడాది ఆగస్టులో బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూసింది. బ్యాంకులోని ఆభరణాలను, నగదును బ్యాంకు ఉద్యోగులు మాయం చేసినట్లు ఖాతాదారులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బ్యాంకు మేనేజర్‌తో పాటు కొంతమంది సిబ్బందిని అరెస్టు చేశారు. బంగారాన్ని, నగదును స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. ఇది జరిగి దాదాపు ఏడాది గడుస్తున్నా తమ బంగారం వెనక్కి ఇవ్వడం లేదని బాధితులు అసహనం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు రోజుకో కార్యక్రమం చొప్పున ఈ దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Updated Date - Jun 02 , 2026 | 05:10 AM