ఎస్బీఐలో ఇంటిదొంగల గుట్టు రట్టు
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:38 AM
చాలాకాలంగా వినియోగంలో లేని (ఇన్‌యాక్టివ్) ఖాతాల నుంచి రూ.2.65 కోట్లను ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేసి.. కొట్టేసిన కేసులో బ్యాంక్ మేనేజర్ సహా నలుగురిని నల్లగొండ ...
బ్యాంక్ మేనేజర్ సహా నలుగురి అరెస్టు
వినియోగంలో లేని ఖాతాలపై కన్ను
వాటి నుంచి రూ.2.65 కోట్ల బదిలీ
హౌస్ కీపింగ్ ఉద్యోగి కీలక పాత్ర
సిబ్బంది కంప్యూటర్లలో లాగిన్ అయి..
కొన్ని ఖాతాల ఫోన్ నంబర్లు మార్చాడు
హైదరాబాద్ కోఠీలోని ఖాతాదారుడి మెయిల్‌కు మెసేజ్‌తో వెలుగులోకి మోసం
2.42 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): చాలాకాలంగా వినియోగంలో లేని (ఇన్‌యాక్టివ్) ఖాతాల నుంచి రూ.2.65 కోట్లను ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేసి.. కొట్టేసిన కేసులో బ్యాంక్ మేనేజర్ సహా నలుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. దేవరకొండకు చెందిన లెండల చక్రపాణి అక్కడి ఎస్బీఐ అగ్రికల్చర్ కమర్షియల్ బ్రాంచ్ (ఏసీబీ)లో ఐదేళ్లుగా హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో బ్యాంకు సిబ్బందికి పనిలో సాయపడేవాడు. ఈ క్రమంలో బ్యాంకు అంతర్గత వ్యవస్థలు, ఖాతాల నిర్వహణపై అవగాహన ఏర్పడింది. అతనికి సూర్యాపేట ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులుతో పరిచయమైంది. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో వినియోగంలో లేని ఖాతాల్లోని నగదును కొట్టేయాలని ప్లాన్ వేశారు. మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా నగదు ఉండి రెండేళ్లుగా లావాదేవీలు చేయని 10 ఖాతాల వివరాలను రామాంజనేయులు సేకరించాడు. అనంతరం ఆ ఖాతాదారుల పేర్లు, ఆధార్ కార్డు, సంతకం నమూనా, పాస్‌పోర్ట్ ఫొటోలు సేకరించి ఓ సైట్ ఆధారంగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేశారు. దేవరకొండలో బ్యాంకు ఉద్యోగులతో సఖ్యతగా ఉండే చక్రపాణి వారు వినియోగించే కంప్యూటర్ పాస్‌వర్డ్ తెలుసుకుని, రద్దీ సమయాల్లో లాగిన్ అయ్యాడు. ఎంచుకున్న ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసి తర్వాత అందులోని నగదును ముందే సేకరించి పెట్టుకున్న ఇతరుల ఖాతాలకు బదిలీ చేశాడు. ఎస్‌బీఐ రికవరీ ఏజెంట్ రాంలాల్, ఫొటోగ్రాఫర్ శివ తమ పరిచయస్తులకు కమీషన్ ఆశచూపి, లీగల్ లావాదేవీలేనని నమ్మబలికి వారి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. ఆ ఖాతాల్లోకే చక్రపాణి నగదు బదిలీ చేశాడు. నగదును చక్రపాణి, రామాంజనేయులు 45 శాతం చొప్పున, మిగతా 10 శాతాన్ని రాంలాల్, శివ పంచుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే హైదరాబాద్‌లోని కోఠిలోని ఎస్‌బీఐ శాఖలో పల్లటి నరేందర్ అనే ఖాతాదారుడి కేవైసీ అప్‌డేట్ చేసినప్పుడు అతని ఈమెయిల్‌కు అలర్ట్ మెసేజ్ వెళ్లింది. ఆయన అక్కడి బ్యాంకు సిబ్బందిని సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దేవరకొండ బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర ఈ నెల 13న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2.65 కోట్లు అక్రమంగా బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాస రావు, సీఐ వెంకట్‌రెడ్డి దర్యాప్తు చేసి కేసును ఛేదించారు.