Share News

పునర్వికను కాపాడినట్టే ఆర్యన్‌నీ రక్షించరూ..

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:47 AM

అరుదైన జన్యుపరమైన సమస్య స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ(ఎస్ఎంఏ-2) బారిన పడిన ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక విషయం మరువక ముందే అదే సమస్యతో బాధపడుతున్న తెలంగాణకు చెందిన ఓ బాలుడి .....

పునర్వికను కాపాడినట్టే ఆర్యన్‌నీ రక్షించరూ..

  • ఘట్‌కేసర్‌కు చెందిన 23 నెలల బాలుడికి స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ

  • చికిత్సకు రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్‌ అవసరం

  • రెండేళ్ల వయస్సు నిండే లోపు మందు ఇస్తే శాశ్వత పరిష్కారం

  • దాతలు, ప్రభుత్వ సాయం కోరుతున్న ఆర్యన్‌ తల్లిదండ్రులు

ఘట్‌కేసర్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అరుదైన జన్యుపరమైన సమస్య స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ(ఎస్ఎంఏ-2) బారిన పడిన ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక విషయం మరువక ముందే అదే సమస్యతో బాధపడుతున్న తెలంగాణకు చెందిన ఓ బాలుడి ఉదంతం బయటకొచ్చింది. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన కాసుల ఆర్యన్‌(23 నెలలు) కూడా ఎస్‌ఎంఏ-2తో బాధపడుతున్నాడు. పునర్విక మాదిరిగానే ఆర్యన్‌కు కూడా రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ చెయ్యాలని వైద్యులు సూచించగా.. పేదలైన ఆర్యన్‌ తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు. పునర్వికకు సంబంధించిన వార్తలను చూసి ఆర్యన్‌ తల్లిదండ్రులు కిరణ్‌-నవీన ‘ఆంధ్రజ్యోతి’ని సంప్రదించారు. ఘట్‌కేసర్‌లోని కేఎల్‌ఆర్‌ నగర్‌కు చెందిన కాసుల ఈ దంపతులు తమ కుమారుడు ఆర్యన్‌లో ఎదుగుదల కనిపించకపోవడంతో కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చూపించారు. వైద్యులు పరీక్షల్లో ఆర్యన్‌కు ఎస్‌ఎంఏ టైప్‌-2 వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆర్యన్‌ ప్రస్తుతం రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వ్యాధి నివారణకు రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్‌ వేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అలాగే, ప్రస్తుతం ట్రయల్స్‌ దశలో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన మరో ఇంజక్షన్‌ కూడా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ రోగికి రెండేళ్ల వయస్సు నిండే లోపు ఇస్తే శాశ్వత ఫలితం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగి అయిన కిరణ్‌ నెల వేతనం రూ.25,000 కాగా.. అప్పులు చేసి ఆర్యన్‌ వైద్యానికి రూ.15లక్షల దాకా ఖర్చు చేశారు. మరో 15 రోజుల్లో ఆర్యన్‌కు రెండేళ్లు రానుండగా ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తం ఎలా సమకూర్చాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. దాతలు, ప్రభుత్వం స్పందించి తమ బిడ్డను రక్షించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మరింత సమాచారం కోసం తమను 96668 83939 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Updated Date - Feb 28 , 2026 | 03:47 AM