సత్యం రామలింగరాజు కుటుంబంపై బాధితుల పోరు
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:10 AM
జన్వాడ ల్యాండ్ లింక్స్ కేసులో విచారణ వేగవంతం కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.
నకిలీ రికార్డులపై ఈడీ కోర్టుకు.. నేడు విచారణ
హైదరాబాద్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): జన్వాడ ల్యాండ్ లింక్స్ కేసులో విచారణ వేగవంతం కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. సత్యం రామలింగరాజు అండ్ కోకు చెందిన 160 కంపెనీలు సాగించినట్లు చెబుతున్న రూ.5 వేల కోట్లస్కామ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు కుటుంబానికి చెందిన ఆవుల అనిత, అడ్వకేట్ రామారావు ఇమ్మానేని ద్వారా నాంపల్లి ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రామలింగరాజు అండ్ కో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో శతభిష, ప్రస్తుతం శ్రవణా బయోటెక్ సంస్థల పేరుతో ఈ వ్యవహారం నడిపినట్లు సమాచారం. ఈడీ కేసు (ఎస్సీ 1/2014)లో ఏ 14 బీ రాధ, ఏ16 బీ రామరాజు, ఏ154 శ్రవణా ఆగ్రో (శ్రవణా బయోటెక్ అనుబంధ సంస్థ) ప్రతినిధులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితులు ఏకంగా బీ రాధ పేరుపై మ్యుటేషన్లు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెం.249లో గొస్పెల్ మిషన్ ఇండియా పేరుతో విక్రయం జరిగినట్లు నకిలీ ప్రొసీడింగ్స్ సృష్టించారని బాధితులు చెబుతున్నారు. సర్వే నెం.309/1, 309/2, 309/3లో రాధ భర్తగా రామలింగరాజు పేరు చూపిస్తూ భూమిని బదలాయించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి ఈడీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ జరపనుంది.