40 ఏళ్లకే కండరాలు కరిగిపోతున్నాయ్
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:27 AM
‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు..
‘సార్కోపీనియా’ సైలెంట్ అటాక్
మధుమేహం, అస్తవ్యస్త జీవనశైలే ప్రధాన కారణం
బరువు తగ్గాలని.. శరీరాన్ని బలహీనపరుచుకోవద్దు
అప్రమత్తంగా ఉండాలన్న జిరియాట్రిక్ సొసైటీ
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు.. నలభై ఏళ్లకే కనిపిస్తోంది. కండరాల బలం తగ్గిపోవడం, నడక మందగించడం, చిన్నపాటి శ్రమకే అలసట, రోజూ చేసే పనులు కూడా చేయలేక పోవడం ఇలా పలు సమస్యలకు పని ఎక్కువైంది.. నిద్ర తగ్గింది.. అంటూ కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ అసలు నిజం మాత్రం ‘సార్కోపీనియా’ అనే కండరాలను కరిగించే వ్యాధి కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సార్కోపీనియా అంటే కండరాల పరిమాణం తగ్గిపోవడం, బలం, శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణించడం. ఒకప్పుడు వృద్ధాప్య లక్షణంగా భావించిన ఈ కండరాల క్షీణత.. మారుతున్న జీవనశైలితో 40 ఏళ్ల వయస్సులో ఉన్న వారిపై దాడి చేస్తోంది. గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయని భారత జిరియాట్రిక్ సొసైటీ హెచ్చరిస్తోంది.
గుర్తించాల్సిన హెచ్చరికలు
వయసు పెరిగే కొద్ది కండరాలు సాధారణంగానే క్షీణిస్తాయి. కానీ, ప్రారంభ దశలోనే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరచూ అలసటగా అనిపించడం, మెట్లు ఎక్కడం కష్టంగా మారడం, నడక వేగం తగ్గిపోవడం, సమతుల్యత కోల్పోయి పడిపోవడం లేదా ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచడం వల్ల జీవన నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే కండరాల నిర్మాణం మరింత వేగంగా దెబ్బ తింటుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోవడం, వయసు పెరిగే కొద్దీ కండరాల పెరుగుదలకు సహాయపడే హార్మోన్లు తగ్గడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గితే మంచిదని భావించి ఆత్రుతగా చేసే క్రాష్ డైట్లు, అధిక ఉపవాసాలు, కొన్ని రకాల బరువు తగ్గించే మందులు వల్ల కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోయి శరీరం పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆహారంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యం
కండరాల ఆరోగ్యానికి రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్ ఉండాలి. పాలు, గుడ్లు, చేపలు, చికెన్, పెరుగు, పప్పులు, సోయా వంటి ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు విటమిన్- డి, విటమిన్- బి12, కాల్షియం లోపాలు లేకుండా చూసుకోవాలి. రోజువారీ నడక ఒక్కటే సరిపోదని, వారానికి రెండు, మూడు రోజులు వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెంట్ వ్యాయామాలు, స్క్వాట్స్ వంటివి చేయడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. కండరాల బలం తగ్గితే శారీరక చురుకుదనం నశించి, తీవ్రమైన ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు కూడా వెంటాడుతాయి. అందుకే రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామం, మధుమేహ నియంత్రణతో ఈ సార్కోపేనియా ముప్పును తొలి దశలోనే అడ్డుకోవచ్చని భారతీయ జెరియాట్రిక్ సొసైటీ స్పష్టం చేస్తోంది.