Share News

పుష్కరం... పునీతం!

ABN , Publish Date - May 23 , 2026 | 05:03 AM

సరస్వతి అంత్య పుష్కరక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో పులకిస్తోంది. రెండోరోజు శుక్రవారం భక్తుల రాక మరింత పెరిగింది. సుమారు 10 వేల మందికి పైగా భక్తులు పుణ్యనదిలో స్నానాలు ఆచరించి...

పుష్కరం... పునీతం!

  • సరస్వతి క్షేత్రంలో ఆధ్యాత్మిక వెల్లువ

  • రెండోరోజు పదివేల మందికిపైగా పుణ్య స్నానాలు

  • వైభవంగా సుబ్రహ్మణ్య షాడాక్షరీ హోమం

  • పుష్కరఘాట్‌ నుంచి ఆలయం వరకు భక్తుల ‘నడక’యాతన

భూపాలపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): సరస్వతి అంత్య పుష్కరక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో పులకిస్తోంది. రెండోరోజు శుక్రవారం భక్తుల రాక మరింత పెరిగింది. సుమారు 10 వేల మందికి పైగా భక్తులు పుణ్యనదిలో స్నానాలు ఆచరించి, పితృదేవతలకు పిండ ప్రధానాలు సమర్పించారు. నదీ తీరమంతా వేద మంత్రాలతో మార్మోగింది. రెండో రోజు వివిధ జిల్లాల నుంచి వచ్చిన న్యాయమూర్తులు పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా వేదపండితులు శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షాడాక్షరీ హోమం నిర్వహించారు. భక్త్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ వేడుకకు షాద్‌నగర్‌ అడిషనల్‌ జిల్లా న్యాయాధికారి సాహితి, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ న్యాయాధికారి కల్పన, ములుగు జిల్లా న్యాయాధికారి సూర్యచంద్రకళతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝా హాజరయ్యారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి స్వామి వారి శేషవస్ర్తాన్ని, తీర్ధ ప్రసాదాలను అందించారు. సాయంత్రం వేళ పుష్కరఘాట్‌ వద్ద నదీమతల్లికి నిర్వహించిన సరస్వతి నవరత్న హారతి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. వివిధ రకాల హారతులతో కార్యక్రమం నయనానందకరంగా సాగింది. దివ్య దీపాల వెలుగుల్లో పుష్కరఘాట్‌ ధగధగలాడింది.

భక్తులకు ‘నడక’యాతన..

ఒకవైపు ఆధ్యాత్మిక ఉత్సాహం ఉరకలేస్తున్నా.. మరోవైపు భక్తులకు కష్టాలు తప్పలేదు. అధికార యంత్రాంగం సమన్వయ లోపంతో పుష్కరఘాట్‌ నుంచి ప్రధాన దేవాలయం వరకు వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండు నుంచి పుష్కరఘాట్‌ వరకు మాత్రమే వాహనాలను (ప్రైవేటు స్కూల్‌ బస్సులు) నడిపించిన అధికారులు.. ప్రైవేటు వాహనాలను దూరంగా నిలిపివేశారు. దీంతో భక్తులు పుష్కరఘాట్‌ నుంచి దేవాలయం వరకు, దేవాలయం నుంచి బస్టాండ్‌ వరకు ఎండలో నడిచివెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో హనుమకొండకు చెందిన రమేష్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదికేశవులు, ఫణీంద్ర అనే భక్తులు ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే 108 వాహనంలో స్థానిక వైద్యశిబిరానికి తరలించి వైద్యం అందించారు.

Updated Date - May 23 , 2026 | 05:03 AM