Share News

వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు

ABN , Publish Date - May 22 , 2026 | 04:13 AM

సరస్వతి అంత్య పుష్కర వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరం..

వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు

  • ప్రారంభించిన కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి.. హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ

  • నదిలో పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా దంపతులు

  • వేద మంత్రోచ్చారణలతో మార్మోగిన శ్రీకాళేశ్వరాలయ పరిసరాలు

  • తొలిరోజే భారీగా పోటెత్తిన భక్తులు

  • 3,500 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ /భూపాలపల్లి/ కాళేశ్వరం, మే 21 (ఆంధ్రజ్యోతి): సరస్వతి అంత్య పుష్కర వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరం.. పుష్కరాల సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో పులకించింది. కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఈ పుష్కర మహోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 5.43 గంటలకు శాస్త్రోక్తంగా నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పరిసరాలు వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగాయి. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సకల విఘ్నాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని కాంక్షిస్తూ అర్చకులు, వేద పండితులు ఘనంగా గణపతి హోమం నిర్వహించారు. సరస్వతి అంత్య పుష్కరాల్లో రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా దంపతులు పాల్గొని పుణ్యస్నానం ఆచరించారు. గురువారం సాయంత్రం 4.29 గంటలకు కాళేశ్వరం చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్‌ శుక్లా, ఆయన సతీమణి జానకి.. సరస్వతి నదిలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మ్యూజియాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. నది హారతిలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

సకల సౌకర్యాలు: మంత్రి శ్రీధర్‌బాబు

సరస్వతి అంత్య పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. పుష్కరఘాట్‌ వద్ద నదీమతల్లికి వారు ప్రత్యేక పూజలు చేసి, శ్రీకాళేఽశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కరాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.


త్రివేణి సంగమంలో..

పుష్కరాల తొలిరోజే కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం, జిల్లా యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. పుష్కరాల కోసం తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రం నలుమూలల నుంచి కాళేశ్వరానికి 3,500 ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.

కడుపు నింపేందుకు కంప్యూటర్‌... మనశ్శాంతి కోసం గుడి కంచి పీఠాధిపతి

‘మనది మానవతా విలువలు కలిగిన దేశం. ఇక్కడ ధర్మప్రచారం మాత్రమే సరిపోదు. ప్రతీ ఒక్కరిలో ధర్మాచరణ ప్రక్రియ కావాలి’ అనికంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. దేశానికి గురుకులాలు, గుడి గోపురాలు, పుణ్య తీర్థాలు ఎంతో అవసరమని తెలిపారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆయన భక్తులకు ప్రవచనం ఇచ్చారు. నేడు మానవుడికి కడుపు నింపుకోవటానికి కంప్యూటర్‌ ఎంత అవసరమో... మనశ్శాంతి కోసం గుడి కూడా అంతే తప్పనిసరి అన్నారు. భారతదేశం కేవలం కోరికలు, ఆశలు పెంచే దేశం కాదని.. ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇచ్చే దేశమని తెలిపారు.

Updated Date - May 22 , 2026 | 04:13 AM