నేటి నుంచి సరస్వతి అంత్యపుష్కరాలు
ABN , Publish Date - May 21 , 2026 | 03:25 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి త్రివేణి సంగమం వద్ద సరస్వతి అంత్య పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి.
తెల్లవారుజామున పుష్కర స్నానం చేయనున్న కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి
వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు సురేఖ, శ్రీధర్ బాబు
30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
నేడు కాళేశ్వరం వెళ్లనున్న గవర్నర్
హైదరాబాద్/వరంగల్/భూపాలపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి త్రివేణి సంగమం వద్ద సరస్వతి అంత్య పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తెల్లవారుజామున 5.43 నిమిషాలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం చేసి అంత్యపుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు. ఈ వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. జూన్ 1వ తేదీ వరకు జరిగే అంత్యపుష్కరాలను పురస్కరించుకుని ప్రతీరోజు ఉదయం హోమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజుల వరకు ప్రతిరోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ నదిలో పుణ్య స్నానం ఆచరిస్తారు. సుమారు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. పుష్కరాల పనుల కోసం రూ.30.63 కోట్ల నిధులను కేటాయించింది. గత ఏడాది సరస్వతి ఆది పుష్కరాల సందర్భంగా జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గోదావరిలో భక్తుల రక్షణ కోసం 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పుష్కర ఘాట్ వద్ద కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు, 245 ఎకరాల్లో లక్ష 70 వేల వాహనాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తాగునీటి కోసం రెండు ఓహెచ్‌ఆర్‌సీలను నిర్మించారు. 500 మరుగుదొడ్లను ప్రత్యేకగా ఏర్పాటు చేశారు. 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి.. 300 మంది వైద్యాధికారులు, పారా మెడికల్ సిబ్బందినీ నియమించారు. అన్ని ప్రధాన కూడళ్లలో అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా వన్‌వేను ఏర్పాటు చేశారు.
12 రోజులు.. 12 రకాలహోమాలు
అంత్యపుష్కరాల్లో 12 రోజులపాటు 12 రకాల హోమాలను నిర్వహించనున్నారు. తొలిరోజు (21న) మహాగణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షాఢాక్షరి హోమం, 23న హయగ్రీవ హోమం, 24న నవగ్రహ హోమం, 25న మహామృత్యుంజయ హోమం, 26న దుర్గసూక్త హోమం, 27న మహా సుదర్శన హోమం, 28న మేద దక్షిణామూర్తి హోమం, 29న స్వయంవర పార్వతి హోమం, 30న ధన్వంతరి హోమం, 31న మహారుద్ర హోమం, జూన్ 1న లఘు చంఢీ, మహాపూర్ణాహుతిని నిర్వహించనున్నారు.
మ్యూజియంను ప్రారంభించనున్న గవర్నర్
గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం చేరుకోనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమ ఘాట్ వద్ద పుష్కర స్నానాలు ఆచరిస్తారు. దేవాదాయ శాఖ రూ.1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక మ్యూజియంను ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం మహా హారతి వేడుకను, సాంస్కృతిక కార్యాక్రమాలను తిలకించనున్నారు.
అంత్యపుష్కర శుభాకాంక్షలు తెలిపిన సీఎం
సరస్వతి అంత్యపుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా భక్తులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం సరస్వతీ అంత్యపుష్కర శుభాకాంక్షలు తెలిపారు. కాగా పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్‌తో కలిసి బుధవారం ఆమె కాళేశ్వరంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.