Share News

పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృతంపై అధ్యయనం అవశ్యం

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:42 AM

నేటి ఆధునిక సాంకేతిక పరిశోధనలకు, కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన మూలాలన్నీ మన వేదాల్లో, పురాణ గ్రంథాల్లో ఉన్నాయని వాటిని శాస్త్రీయంగా పరిశీలించాలంటే సంస్కృత భాషపై అధ్యయనం అవసరమని..

పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృతంపై అధ్యయనం అవశ్యం

  • రచయిత, రాజకీయవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

  • కాలిఫోర్నియాలో అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనం

(మిల్పిటాస్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

నేటి ఆధునిక సాంకేతిక పరిశోధనలకు, కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన మూలాలన్నీ మన వేదాల్లో, పురాణ గ్రంథాల్లో ఉన్నాయని వాటిని శాస్త్రీయంగా పరిశీలించాలంటే సంస్కృత భాషపై అధ్యయనం అవసరమని రచయిత,రాజకీయవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. శనివారం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌ నగరంలో ఆరియా విశ్వవిద్యాలయం, శ్యామా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రప్రథమ అంతర్జాతీయ సంస్కృత సమ్మేళనాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ... 1938లో రాజమహేంద్రవరానికి చెందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రిని హిట్లర్‌ జర్మనీ తీసుకువెళ్లి క్షిపణులు, అణ్వాయుధాలకు సంబంధించి వేదాల్లోని సూత్రాలను డీకోడ్‌ చేయించారని తెలిపారు. జర్మనీ విశ్వవిద్యాలయంలో విశ్వనాథశాస్త్రి చిత్రపటం ఉందన్నారు. టిబెట్లోని వాంపాలో దొరికిన కొన్ని సంస్కృత గ్రంథాలను చైనా పరిశోధకులు ఛండీగఢ్‌ విశ్వవిద్యాలయ సంస్కృతపండితులచే డీకోడ్‌ చేయించి ఆధునిక క్షిపణుల తయారీకి వినియోగించారని తెలిపారు. హిమాలయన్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ ప్రకాశ్‌ దివాకరన్‌ మాట్లాడుతూ.. సంస్కృత భాషలోని భాషా శాస్త్ర, వైద్య, సాంకేతిక విజ్ఞానం ఆధునిక జీవితానికి ఎంతో ఉపయుక్తమన్నారు. డా. కూచిభొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ.. భారతదేశంలోని విద్యాసంస్థలు సంస్కృత భాషకు తగినంత ప్రాముఖ్యం ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. కార్యక్రమంలో సీఈఓ రాజు చమర్తి, డాక్టర్‌ ప్రభాకర్‌ కల్వచర్ల, వెంకట్‌ గుడివాడ, డా. రేమిళ్ళ రామకృష్ణ శాస్త్రి, సత్యప్రియ తనుగుల పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 06:44 AM