Hyderabad Traffic: పండక్కి ఊరిబాట!
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:14 AM
సంక్రాంతి పండుగ కోసం పట్టణమంతా పల్లెకు తరలింది. హైదరాబాద్ నుంచి లక్షలాది మంది ప్రజలు వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరారు.
సంక్రాంతి కోసం సొంతూళ్లకు తరలిన జనం
రద్దీగా మారిన జాతీయ రహదారులు
టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు
హైదరాబాద్ నుంచి వెళ్లేవైపు బిజీ.. వచ్చే వైపు ఖాళీ!
ఓఆర్‌ఆర్‌పైకి ఒక్కరోజే 3.23 లక్షల వాహనాలు
చౌటుప్పల్ రూరల్, చౌటుప్పల్ టౌన్, కేతేపల్లి, బీబీనగర్, హైదరాబాద్ సిటీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ కోసం పట్టణమంతా పల్లెకు తరలింది. హైదరాబాద్ నుంచి లక్షలాది మంది ప్రజలు వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరారు. దీనితో మంగళవారం ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, బీబీనగర్ మండలం గూడూరు, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిటకిటలాడుతున్నాయి. రోడ్లపై హైదరాబాద్ నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లేవైపు రద్దీ తీవ్రంగా ఉంటే.. హైదరాబాద్‌కు వచ్చే వైపు అంతా ఖాళీగా ఉంటోంది. దీనితో టోల్‌ప్లాజాల వద్ద అవతలి రోడ్డువైపు గేట్లలో నుంచీ ఊర్లకు వెళ్లే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక ఎక్కడా ట్రాఫిక్ స్తంభించిపోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్‌ను విస్తృతం చేశారు. మరోవైపు చాలా మంది ద్విచక్ర వాహనాలపైనా సొంతూళ్లకు వెళుతుండటంతో రహదారులపై రాకపోకలు మెల్లగా సాగుతున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఇనాంగూడ వద్ద కర్రల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రిభువనగిరి జిల్లా ధర్మోజిగూడెం వద్ద హైవే పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కోల నరేశ్ (38) అనే కానిస్టేబుల్ మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన నరేశ్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మరో కానిస్టేబుల్‌తో కలిసి ధర్మోజిగూడెం వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు.
ఔటర్‌పై వాహనాల రద్దీ రికార్డు
సంక్రాంతికి వెళ్లేవారితో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ నమోదైంది. ఔటర్‌పై రోజూ సుమారు 2.30 లక్షల వరకు వాహనాలు ప్రయాణిస్తుంటాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు 2.85లక్షలకుపైగా వాహనాలు ఔటర్‌పైకి వస్తే.. తర్వాతి 24 గంటల్లో అంటే శనివారం అర్ధరాత్రి వరకు ఏకంగా 3.23 లక్షలు ప్రయాణించాయి. ఔటర్‌పై వాహనాల రద్దీలో ఇది రికార్డు కావడం గమనార్హం. ఆది, సోమ, మంగళవారాల్లో కూడా సుమారు 3 లక్షల వరకు వాహనాలు ఔటర్ ఎక్కాయి.