Share News

Hyderabad-Vijayawada Highway: జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ..

ABN , Publish Date - Jan 12 , 2026 | 03:44 AM

సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు వెళుతున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతోంది.

Hyderabad-Vijayawada Highway: జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ..

  • హైదరాబాద్‌-బెజవాడ హైవేలో వేలాది వాహనాలు

  • శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల లోపు పంతంగి టోల్‌ప్లాజా దాటిన వాహనాలు 60 వేలకు పైనే..!

చౌటుప్పల్‌ రూరల్‌, కేతేపల్లి, బీబీనగర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు వెళుతున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహన రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్‌-విజయవాడ హైవే ఇదేం ట్రాఫిక్‌ రా బాబోయే అనుకునేంతలా వాహనాలతో కిటకిటలాడింది. శనివారంతో పోలిస్తే ఆదివారం ఉదయం కాస్త తగ్గినట్టు కనిపించిన వాహన రద్దీ సాయంత్రానికి భారీగా పెరిగిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌గేటు మీదుగా 60వేలకు పైగా వాహనాలు వెళ్లినట్లు సమాచారం. టోల్‌ ప్లాజాలోని 16 గేట్లల్లో 11 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపించారు. అలాగే, ఇదే హైవేలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా మీదుగా మీదుగా శనివారం 80 వేలకు పైగా వాహనాలు వెళ్లగా ఆదివారం 30 వేలకు పైగా వాహనాలు వెళ్లాయని అంచనా. ఈ టోల్‌ప్లాజాలోని 12 గేట్లలో 7 గేట్ల నుంచి వాహనాలను విజయవాడ వైపు పంపిస్తున్నారు. మరోపక్క, యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్‌-భూపాలపల్లి హైవేపై కూడా ఆదివారం రద్దీగా మారింది. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి, భువనగిరిలోని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనాలకు తరలివచ్చిన భక్తుల తిరుగుప్రయాణాలతో వాహన రద్దీ కనిపించింది. బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద సుమారు అర కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. వరంగల్‌ వైపు రోడ్డులోనూ సంక్రాంతి సందడి కనిపించింది.


ఈ రూట్‌లో వెళితే మేలు..

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిలో వాహన రద్దీ కొనసాగుతోంది. అయితే, ఈ హైవేలో కొన్ని చోట్ల అండర్‌ పాస్‌ వంతెన, సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిస్తుండగా వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బంది పడే అవకాశముంది. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు పోలీసు వారు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. అవి ఏంటంటే.. హైదరాబాద్‌ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్‌పల్లి వరకు వెళ్లి అద్దంకి జాతీయ రహదారి మీదుగా వెళుతుంటారు. వీరు విజయవాడ హైవేలో వెళితే హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకొనే అవకాశముంది. అదే ఈ మార్గానికి బదులు పదుల కిలోమీటర్ల దూరం పెరిగినా హైదరాబాద్‌- నాగార్జునసాగర్‌ హైవే మీదుగా వెళితే ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఓఆర్‌ఆర్‌ మీదుగా ఈ రూట్‌లో వెళ్లాలనుకునే వారు బొంగళూరు గేట్‌ వద్ద ఎగ్జిట్‌ తీసుకొని నాగార్జునసాగర్‌ హైవేపైకి వెళ్లవచ్చు. అలాగే, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు.


హైదరాబాదీల ట్రాఫిక్‌ ఇక్కట్లకు చిన్న బ్రేక్‌ !

ఖాళీగా కనిపిస్తున్న రహదారులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాదీల ట్రాఫిక్‌ కష్టాలకు చిన్న బ్రేక్‌ పడింది. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి లక్షలాది మంది తమ స్వస్థలాలకు వెళుతుండడంతో మహానగరం క్రమంగా ఖాళీ అవుతోంది. నిత్యం ఎంతో రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని కొన్ని రోడ్లు ఆదివారం ఖాళీగా కనిపించాయి. సొంతూళ్లకు వెళ్లే వారి ప్రయాణాలు కొనసాగుతుండగా.. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లను చేరుకునే మార్గాల్లో మాత్రం వాహన రద్దీ కనిపించింది. సొంతూళ్లకు వెళ్లిన వారు మూడు, నాలుగు రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని, అప్పటిదాకా హైదరాబాద్‌ రోడ్లు ట్రాఫిక్‌ రద్దీ లేకుండా కాస్త ప్రశాంతంగా ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Jan 12 , 2026 | 06:46 AM