Share News

Sankranti Festival Celebrations: తెలంగాణ సంక్రాంతి సంబురం

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:29 AM

కొత్త ధాన్యాలతో, కోడి పందేలతో ఊళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు..

Sankranti Festival Celebrations: తెలంగాణ సంక్రాంతి సంబురం

  • తెలంగాణ వాసుల, ప్రవాసుల సరికొత్త ట్రెండ్‌

  • సంక్రాంతికి ఏపీ బాట పడుతున్న వైనం

  • కోడి పందేలు చూసేందుకు క్యూ

  • జనసంద్రంగా మారిన ఆంధ్రా పట్టణాలు

  • వారం ముందే లాడ్జీల్లో బుకింగ్‌

  • పెరిగిన హోం స్టే కల్చర్‌.. ధరలు రెట్టింపు

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కొత్త ధాన్యాలతో, కోడి పందేలతో ఊళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు.. అదో భావోద్వేగం. తెలుగు లోగిళ్లలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, డూడూ బసవన్నలతో సందడే సందడి. సంక్రాంతి ‘పండగ’ చేసుకునేందుకు తెలంగాణ వాసులూ ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు పండగ రూటు మారిపోయింది. విదేశాల్లో ఉండే తెలంగాణ వారు కూడా పండక్కి ఆంధ్రా బాట పడుతున్నారు. అమెరికాలోని డాలస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన దేవాన్ష్‌.. అమ్మానాన్నలతో కబుర్లు చెప్పి, పిండి వంటలు తింటూ హాయిగా గడిపేస్తాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ, అతను ఇంటికెళ్లిన వెంటనే కారు తీసుకొని విజయవాడ హైవే ఎక్కేశాడు. ఎందుకంటే సంక్రాంతి సంబరాల కోసం!! భీమవరం బరిలో వినే కోడి పుంజుల కేకలు.. కోనసీమ ప్రభల కోలాహలాన్ని ఆస్వాదించేందుకు బయల్దేరారు. సంప్రదాయ పంచెకట్టుతో పచ్చని పొలం గట్ల మీద నడవడం.. నాటుకోడి పులుసు, ఆంధ్రా స్పెషల్‌ అయిన వెదురు బొంగులో వండే చికెన్‌ తినడాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే తెలంగాణ ప్రాంతానికి చెందిన వేలా ది మంది ఎన్‌ఆర్‌ఐలు ఆంధ్రా పల్లెల్లో వాలిపోతున్నా రు. తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతి అంటే ఒకప్పుడు పిండివంటలు, ముగ్గులు, బంధుమిత్రుల కలయిక.. కానీ, ఇప్పుడు వాటితో పాటు ఆంధ్రా పల్లెల్లో జరిగే సంబరాల్లో పాల్గొనడం, ఆస్వాదించడం ట్రెండ్‌గా మారింది. అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ ప్రవాసులు ఈ సారి తమ సొంతూళ్లకు వెళ్లి ఒకటి రెండ్రోజులు గడిపి ఆ తర్వాత ఏపీ హైవే ఎక్కేస్తున్నారు.


కోడి పందేలు చూసేందుకు క్యూ..

తెలంగాణకు ప్రవాసులు గతంలో తమ స్వగ్రామా ల్లో లేదా హైదరాబాద్‌లోని ఇళ్లలో పండగ చేసుకుని తిరిగి వెళ్లిపోయేవారు. కానీ, గత ఐదేళ్లుగా ట్రెండ్‌ పూర్తిగా మారింది. ‘హైదరాబాద్‌లో పండగంటే అపార్ట్‌మెంట్‌లో ముగ్గులు వేయడం, టీవీలు చూడడం. ఆంధ్రాలో పండగంటే ఒక జీవం కనిపిస్తుంది’ అని అంటున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఆ ఆనందాన్ని ఆస్వాదించడం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రా జిల్లాలకు వెళుతున్నారు. పందెం కోళ్ల విన్యాసాలు చూడడంతో పాటు అక్కడి కిక్కు కోసం డాలర్లను కూడా లెక్క చేయకుండా ఎన్‌ఆర్‌ఐలు తరలివస్తున్నారు. విదేశీయులు సైతం వీటిని వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి సంబరాలు అంతర్జాతీయ కార్యక్రమంగా మారాయి. సంక్రాంతి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులను చెరిపేసింది. ‘మా ఊరు ఖమ్మం అయినా.. సంక్రాంతికి భీమవరం వెళ్లకపోతే పండగ చేసుకున్న ట్లే ఉండదు’ అని లండన్‌లో స్థిరపడ్డ వ్యాపారి ఎన్‌.చక్రవర్తి చెబుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన ఈశ్వర్‌ అమెరికాలో స్థిరపడ్డారు.


సంక్రాంతికి ఎప్పు డూ సొంతూరు వెళ్లే ఆయన.. ఈ సారి ప్లాన్‌ మా ర్చారు. నాలుగురోజుల ముందే ఇండియాకు చేరుకున్న ఈశ్వర్‌.. స్నేహితులతో కలిసి ఐదు రోజుల పాటు ఆంధ్రాలో సంప్రదాయ వేడుకల్లో మునిగి తేలేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ‘పంచె కట్టి పొలాల గట్ల మీద తిరుగుతూ.. ఆంధ్రాలో సంక్రాంతి జరుపుకోవడం ఒక అనుభూతి’ అని ఉత్సాహంగా చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన రితీశ్‌రెడ్డి అమెరికాలోని డాల్‌సలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఏటా సంక్రాంతికి హైదరాబాద్‌ వచ్చే అతను ఈసారి తన మిత్రులతో కలిసి పశ్చిమగోదావరి జిల్లాలోని మా రుమూల పల్లెలో పండగ జరుపుకోవడానికి వెళ్లారు. నిజామాబాద్‌కు చెందిన రవి దుబాయ్‌ నుంచి రాగానే ఒకరోజు ఇంటి దగ్గర ఉండి సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న జక్కుల సాత్విక్‌ సొంతూరు మహబూబాబాద్‌కు వచ్చీరాగానే తండ్రి రామారావుతో కలిసి భీమవరం వెళ్లి సంక్రాంతి అక్కడే జరుపుకొంటున్నారు. ఇలా అనేక మంది ఎన్‌ఆర్‌ఐలు ఆంధ్రా బాట పట్టారు.


నులక మంచం.. పంచెకట్టు..

అమెరికాలో ఏసీ గదుల్లో సూట్లు బూట్లు వేసుకుని కార్పొరేట్‌ కొలువులు చేసే ఎన్‌ఆర్‌ఐలు ఇప్పుడు నులక, మడత మంచాల మీద సేద తీరుతున్నారు. తెల్లవారుజామునే నిద్రలేవడం, సంప్రదాయబద్ధంగా పంచె కట్టడం, పచ్చని పొలం గట్ల మీద నడుస్తూ ఆ చల్లని గాలిని ఆస్వాదించడం వారికి ఎంతో తృప్తినిస్తోంది. సంక్రాంతి పిండి వంటలతో పాటు ఇప్పుడు ఆంధ్రా పల్లెల్లో కొత్త వంటకాల తయారీ ఎక్కువైంది. ఆ రుచికి తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఫిదా అయిపోతున్నారు. మట్టిపొయ్యి మీద నాటుకోడి పులుసు, ‘బొంగులో చికెన్‌’ బిర్యానీలను ఇష్టంగా తినేస్తున్నారు.

గ్లోబల్‌ వెలుగులు విరజిమ్ముతున్న సంక్రాంతి!

ఆంధ్రాలోని పట్టణాలు, పల్లెలు ఇప్పుడు జనసంద్రంగా మారాయి. విజయవాడ, రాజమండ్రి, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో లాడ్జిలు వారం రోజుల ముందే బుక్‌ అయిపోయాయి. హోటళ్లు దొరక్కపోవడంతో పల్లెటూర్లలోని ఇళ్లను అద్దెకు తీసుకునే ‘హోం స్టే’ సంస్కృతి పెరిగింది. ఒక్కో ఇంటికి మూడు రోజులకు గాను రూ.20-50 వేల వరకు చెల్లించేందుకు ఎన్‌ఆర్‌ఐలు వెనకాడడం లేదు. ఇలాంటి సమయంలో స్నేహమే అతిథి గృహంగా మారుతోంది. ఆదిలాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ మెండెం కిరణ్‌కు కాకినాడలోని తన మిత్రుడు పితాని చలం ఇంటికి వెళ్లారు. చలం కుటుంబం ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. పొద్దున్నే వేడివేడి గారెలు, మధ్యాహ్నం నాటుకోడి పులుసు, సాయంత్రం బొంగులో చికెన్‌ విందులతో ఎన్‌ఆర్‌ఐలు ఖుషీ చేస్తున్నారు. ఈ వలసల వల్ల ఆంధ్రా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఊపందుకుంది. కారు అద్దెలు, హోటళ్ల చార్జీలు, పిండి వంటల ఆర్డర్లు, నాటు కోడి భోజనాలు ఇలా ప్రతిదీ రెట్టింపు ధర పలుకుతోంది. సంక్రాంతి అంటే ఇప్పుడు తెలుగు వాళ్ల పండగ మాత్రమే కాదని.. అది ‘సౌత్‌ ఇండియా కార్నివాల్‌’లా మారిందని అంటున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో జరిగే సంక్రాంతి ఇప్పుడు గ్లోబల్‌ వెలుగులు విరజిమ్ముతోంది.

Updated Date - Jan 15 , 2026 | 05:31 AM