Share News

kumaram bheem asifabad- పల్లె లోగిళ్లలో సంక్రాంతి సందడి

ABN , Publish Date - Jan 14 , 2026 | 10:22 PM

రంగ వల్లులు, గొబ్బెమ్మలు.. గాలి పటాలు.. నోరూరించే పిండి వంటల ఘుమఘుమలు.. హరిదాసు పాటలు.. బసవన్న ఆటలతో పల్లెలో సంక్రాంతి సందడి నెలకొన్నది. సెలవులు రావడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు అందరూ సిద్దమవుతున్నారు.

kumaram bheem asifabad- పల్లె లోగిళ్లలో సంక్రాంతి సందడి
ఆసిఫాబాద్‌లో నోముల వస్తువులను కొనుగోలు చేస్తున్న మహిళలు

- నేడు సంక్రాంతి పర్వదినం

- పిండి వంటల ఘుమఘుమలు

- ఇంటింటా రంగవల్లుల శోభ

ఆసిఫాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రంగ వల్లులు, గొబ్బెమ్మలు.. గాలి పటాలు.. నోరూరించే పిండి వంటల ఘుమఘుమలు.. హరిదాసు పాటలు.. బసవన్న ఆటలతో పల్లెలో సంక్రాంతి సందడి నెలకొన్నది. సెలవులు రావడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు అందరూ సిద్దమవుతున్నారు. పల్లె, పట్టణ వీధులకు కొత్త సంబరాలను తెచ్చే సంక్రాంతి పండగ రానేవచ్చింది. బుధవారం భోగి పండుగను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేసి వాటి మధ్య గొబ్బిళ్లను ఉంచారు. నవధాన్యలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. నేడు మకర సంక్రాంతి, రేపు కనుమ కావడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు చేరారు. మూడు రోజుల పాటు సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు.

- పిండి వంటలు..

సంక్రాంతి అనగానే సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు వంటి పిండి వంటలను ఆస్వాదించాల్సిన పండుగ. అందరిళ్లలో సకినాల ఘుమఘుమలు వెదజల్లుతాయి. ఉమ్మడి కుటుంబాల్లోనైతే పది రోజుల ముందు నుంచే పిండి వంటల సందడి కనిపించింది. ఏ ఇళ్లు తలుపు తట్టినా పిండి వంటల తయారే దర్శణమించ్చింది. నెలల తరడి నిల్వ చేసుకునే స్థాయిలో సిద్ధం చేసుకున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఇళ్ల ముంగిట ముత్యాల ముగ్గుల సొబగులను చూడాల్సిందే. ముగ్గుల నడుమ ఆవుపేడ గొబ్బెమ్మలు, రేగుపళ్లు, నవధాన్యాలు, గరిక పొసలు, పూలను అందంగా అలంకరిస్తారు. ఈ క్రమంలో మార్కెట్‌లో రంగుల దుకాణాలు వెలిశాయి. చిన్నారుల కోసం ఆకర్షణీయమైన పతంగులు తీసుకు వచ్చారు. బస్టాండ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగి పోయింది. ఐదు రోజుల ముందు నుంచి పాఠశాలలకు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇంటికి చేరుకున్నారు. గ్రామంలోని మిత్రులతో కలిసి సందడి చేస్తున్నారు.

- మార్కెట్‌లో రద్దీ..

జిల్లాలోని మార్కెట్‌లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొన్నది. ఆసిఫాబాద్‌ పట్టణంలో నిత్యావసర వస్తువులతో పాటు వివిధ రకాల వస్తువుల కొనుగో లు కోసం ప్రజలు తరలి రావడంతో మార్కెట్‌లో రద్దీ నెలకొంది. సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలు ఇళ్లలో ప్రత్యేక నోములు నోచుకుంటుండ డంతో నోముల వస్తువుల కొనుగోలుతో పాటు సంక్రాంతి పండగకు పిండి వంటలు తయారు చేయడానికి గాను నిత్యావసర కొనుగోలు కోసం పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. సంక్రాంతి పండగ సందర్భంగా తమ ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసేందుకు యువతులు, మహిళలు రంగుల కొనుగోలులో బిజీబిజీగా గడపారు. ఆసిఫాబాద్‌ మండలంతో పాటు వాంకిడి, కెరమెరి, తిర్యాణి, రెబ్బెన మండలాల నుంచి నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. దీంతో మార్కెట్‌ కిక్కిరిసి పోయింది. పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను కొనుగోలు చేపట్టడంతో బట్టల దుకాణాలు బిజీగా కనిపించాయి. పండుగ సందర్భంగా దూర ప్రాంతా ల నుంచి స్వగ్రామాలకు ప్రజలు తరలి వస్తుండ డంతో పాటు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తుండడంతో బస్సులన్ని రద్దీగా కనిపిస్తున్నాయి. పండుగ సందర్భంగా ఆర్టీసీ అదికారులఅఉ ఆసిఫాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 10:22 PM