సంజయ్‌కుమార్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:16 AM
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. సంజయ్ కుమార్ పార్టీ మారినట్లు ధ్రువీకరించే ఆధారాలు...
పార్టీ మారినట్లు ధ్రువీకరించే ఆధారాల్లేవు
తీర్పు వెలువరించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్
తాజా తీర్పుతో 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలేనని ధ్రువీకరణ
కడియం పిటిషన్‌పై విచారణ 19వ తేదీకి వాయిదా
హైదరాబాద్/జగిత్యాల, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. సంజయ్ కుమార్ పార్టీ మారినట్లు ధ్రువీకరించే ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన స్పీకర్.. ఈ మేరకు తీర్పును వెలువరించారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్.. ఇప్పటికే 7 పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ధ్రువీకరించే ఆధారాలు లేవని తేల్చిన స్పీకర్.. వాటిని కొట్టివేశారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్‌ను సైతం అదే తరహాలో కొట్టేశారు. దీంతో అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, టి.ప్రకా్‌షగౌడ్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని స్పీకర్ తేల్చినట్లయింది. మరోవైపు.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పైనా స్పీకర్ విచారణ చేపట్టారు. అయితే ఇరుపక్షాల సమ్మతితో ఈ కేసు విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపైన విచారణను ఈ నెల 18కి స్పీకర్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే: సంజయ్‌కుమార్
‘‘నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే.. నా జీతం నుంచి నెలకు రూ. 5 వేలు బీఆర్‌ఎస్ లెజిస్లేటర్ పార్టీకి చెల్లిస్తున్నా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని స్పీకర్‌కు అఫిడవిట్ ఇచ్చా.. భవిష్యత్తులో ఏ అంశంపైనైనా బీఆర్‌ఎప్ విప్ జారీ చేస్తే పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటా’’ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. జగిత్యాలలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచినా, అభివృద్ధి కోసం సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుతో కలిసి పని చేస్తున్నానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిస్తే బీఆర్‌ఎస్ నాయకులు నానా హైరానా చేశారన్నారు. ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.