కొత్త సీఎస్.. సంజయ్ జాజు?
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:09 AM
తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది.
2014లో డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుకు.. అప్పట్నుంచీ అక్కడే
తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రిలీవ్ చేసిన కేంద్రం
ప్రధాన కార్యదర్శి రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్
జాజుకే సీఎస్ పోస్టు దక్కే అవకాశం
సీఎస్‌గా 30న ముగియనున్న
రామకృష్ణారావు పదవీ కాలం
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే జూలై నెలలో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కేంద్ర సర్వీసు నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్‌జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. అయితే 2014 అక్టోబరు నెలలో డిప్యూటేషన్ పైన కేంద్ర సర్వీసుకు వెళ్లిన సంజయ్ జాజు.. 2018, మార్చి వరకు ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2024 నుంచి కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలం కేంద్ర సర్వీసులోనే కొనసాగిన ఆయన.. సొంత కేడర్‌కు రావడానికి ఇష్టపడలేదని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసింది. తెలంగాణ క్యాడర్‌కు తిరిగి పంపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎస్‌గా నియమించేందుకేనా!?
ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు 2025 ఆగస్టు నెలలోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి అభ్యర్థన మేరకు రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం ఇప్పటికి రెండుసార్లు (మొదటిసారి ఏడు నెలలు, రెండోసారి మూడు నెలలపాటు) పొడిగించింది. ఈ నెల 30తో సీఎస్‌గా రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుంది. సరిగ్గా కొత్త సీఎస్‌ను నియమించే సమయానికి సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ కావడం.. ఆయనే కొత్త సీఎస్ కానున్నారన్న సంకేతాన్ని ఇస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సంజయ్‌జాజు పూర్తిగా కేంద్ర సర్వీసులోనే ఉండటమూ ఆయనకు కలిసి వస్తోందన్న ప్రచారమూ ఉంది. రానున్న రెండున్నరేళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలకం కావడంతో.. గత ప్రభుత్వం కింద పని చేయని సీనియర్ అధికారిని సీఎస్‌గా తీసుకోవడానికే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉందనీ చెబుతున్నారు. కేంద్ర సర్వీసులో పనిచేసిన అనుభవంతో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంజయ్ జాజు సరిగా నెగోషియేట్ చేయగలరని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్‌లు జయేశ్ రంజన్, వికాస్ రాజ్‌లు.. సీఎస్ పోస్టుపై ఇప్పటికీ ఆశలు పెట్టుకునే ఉన్నారు. వారిద్దరూ 1992 బ్యాచ్‌కు చెందినవారే కావడం గమనార్హం. రాష్ట్ర పాలనలో వీరికి సీనియారిటీ ఉంటే.. కేంద్ర ప్రభుత్వంలో సంజయ్ జాజుకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లోనే కొత్త సీఎస్ ఎవరన్నదానిపై రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.