Share News

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ జాజు

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:21 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజు నియమితులయ్యారు. సంజయ్‌ 1992 బ్యాచ్‌ అధికారి. ఇదే బ్యాచ్‌కు చెందిన మరో ఇద్దరు సీనియర్‌..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ జాజు

  • పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్‌ సీఎస్‌గా అదనపు

  • బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • జయేశ్‌ రంజన్‌, వికా్‌సరాజ్‌ల నుంచి పోటీ

  • సంజయ్‌ వైపే మొగ్గు చూపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • కేంద్రం, ఉమ్మడి ఏపీ, తెలంగాణలో జాజు కీలక బాధ్యతలు

  • సీఎం సలహాదారు, ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా రామకృష్ణారావును నియమించిన ప్రభుత్వం

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజు నియమితులయ్యారు. సంజయ్‌ 1992 బ్యాచ్‌ అధికారి. ఇదే బ్యాచ్‌కు చెందిన మరో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌లు జయేశ్‌ రంజన్‌, వికాస్ రాజ్‌ల నుంచి పోటీ ఎదురైనప్పటికీ. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సంజయ్‌ వైపే మొగ్గు చూపారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సంజయ్‌.. తాను సీఎస్‌గా రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. దీంతో రేవంత్‌ ఆయనకే సీఎస్‌ పదవి కట్టబెట్టారు. ప్రస్తుత సీఎస్‌ కె.రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30తోముగియనుంది. ఆయన స్థానంలో సంజయ్‌ జాజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, పరిశ్రమల పెట్టుబడుల విభాగం సీఈవోగా, ‘స్మార్ట్‌ ప్రోయాక్టివ్‌ ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ(స్పీడ్‌)’ సీఈవోగా అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు.


క్యాడర్‌ తెలంగాణ.. స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌

తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్‌ జాజు సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌. ఆయన 1969 ఫిబ్రవరి 26న జన్మించారు. బీఈ మెకానికల్‌, ఎంటెక్‌ పూర్తి చేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్‌.. రాష్ట్ర సీఎ్‌సగా రెండేళ్ల ఎనిమిది నెలల పాటు పనిచేయనున్నారు. నిజానికి రాష్ట్ర క్యాడర్‌లో ఈయన కంటే మరో ఇద్దరు సీనియర్లు ఉన్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన శశాంక్‌ గోయెల్‌ ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఆయన సెప్టెంబరులో పదవీ విరమణ చేయనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన అర్వింద్‌కుమార్‌ను ప్రభుత్వం పక్కన పెట్టింది. మరోవైపు 1992 బ్యాచ్‌కే చెందిన జయేశ్‌ రంజన్‌ 15 నెలల తర్వాత, వికాస్ రాజ్‌ 22 నెలల తర్వాత రిటైర్‌ కానున్నారు. వీరికంటే సంజయ్‌ జాజుకు రిటైర్మెంట్‌ గడువు ఎక్కువగా ఉండడంతో ఆయనకే అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది.


‘మీ-సేవా’ రూపకర్త

సంజయ్‌ జాజు 34 ఏళ్ల పాటు అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటి వరకు కేంద్రంలోని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సేవలందించిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం రిలీవ్‌ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ముఖ్యకార్యదర్శిగా 2011 నుంచి 2014 వరకు సేవలందించారు. అప్పుడే ఐటీ రంగంలో పలు వినూత్న ఆవిష్కరణలకు రూపమిచ్చారు. సామాన్య ప్రజలకు బాగా చేరువైన ‘మీ-సేవ’ ప్రాజెక్టును రూపొందించింది ఆయనే. ఉమ్మడి ఏపీలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా, విశాఖపట్నం మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేశారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గానూ సేవలందించారు. కేంద్ర సర్వీసుల్లో.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలోని నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) వ్యవస్థాపక డైరెక్టర్‌గా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు.


సలహాదారుగా రామకృష్ణారావు

ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సీఎస్‌ కె.రామకృష్ణారావును ముఖ్యమంత్రికి సలహాదారుగా, ఎక్స్‌ అఫిషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును 2025 ఏప్రిల్‌ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన అదే ఏడాది ఆగస్టు 31న రిటైర్‌ కావాల్సి ఉంది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును మరో 7 నెలలు పొడిగించింది. అంటే, ఈ ఏడాది మార్చి 31న బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంది. సీఎం మరో 3 నెలల పాటు పొడిగించాలని కోరడంతో కేంద్రం ఈ నెల 30 వరకు పదవీ కాలాన్ని పొడిగించింది. దీంతో ఆయన 30న రిటైర్‌ కానున్నారు.

Updated Date - Jun 27 , 2026 | 06:23 AM