Share News

మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:23 AM

క్యాన్సర్‌ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఆ మహమ్మారిపై పోరాటానికి మనో ధైర్యం కావాలని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ అన్నారు..

మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది

  • నేనూ క్యాన్సర్‌ బారిన పడ్డా

  • ఆ మహమ్మారిపై పోరుకు మనో ధైర్యం కావాలి

  • బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌

  • ఆస్పత్రిని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతా

  • బసవతారకం ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్‌ సిటీ/ బంజారాహిల్స్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, ఆ మహమ్మారిపై పోరాటానికి మనో ధైర్యం కావాలని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చైర్మన్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ట్రస్ట్‌బోర్డు సభ్యులు నారా బ్రాహ్మణి, జేఎ్‌సఆర్‌ ప్రసాద్‌లు సంజయ్‌ దత్‌కు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఉన్న నందమూరి తారకరామారావు దంపతుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఆస్పత్రిలో కీలక విభాగాలను, చిన్న పిల్లల వార్డును సందర్శించి వైద్యులు, రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రోగులకు పళ్లు, చిన్నారులకు బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సంజయ్‌ దత్‌ మాట్లాడుతూ.. తన తల్లి క్యాన్సర్‌తో చనిపోయిందని, కొన్నేళ్ల క్రితం తానూ లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్నానని తెలిపారు. క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఆఽధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, ముందస్తు పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందితే పూర్తిగా నయమవుతుందని ధైర్యం చెప్పారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు వెనుక ఉన్న కారణాలు, ఆశయాలు, లక్షాలు వివరించారు. తన తల్లి పేరుతో నిర్మించిన ఈ వైద్యశాలను దేశంలోనే అత్యున్నత శ్రేణి క్యాన్సర్‌ చికిత్సా కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఎందరో క్యాన్సర్‌ రోగులకు స్వాంతన అందిస్తున్నామని గణాంకాలతో సహా వివరించారు. భవిష్యత్తులో ఆత్యాధునిక డయాగ్నొస్టిక్‌ పరికరాలు, రేడియేషన్‌, రోబోటిక్‌ ఆపరేషన్‌ సిస్టం లాంటి ప్రపంచ శ్రేణి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లాబరేటరీలను అందుబాటులోకి తెచ్చి, ప్రపంచ స్థాయి అత్యున్నత శ్రేణి ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 04:23 AM