పారిశుధ్య కార్మికురాలే టీచరమ్మగా మారి
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:42 AM
బడిలో పారిశుధ్య కార్మికురాలిగా గదులు, పరిసరాలను శుభ్రం చేయడం అనే బాధ్యత మాత్రమే కాదు.. అవసరమైతే పిల్లలకు పాఠాలూ చెప్పగలను అని చాటుకుంది ఆ యువతి...
ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్ గైర్హాజరు
రోజంతా పిల్లలకు పాఠాలు చెప్పిన స్వీపర్ నజ్మా
హనుమకొండ జిల్లా జోగంపల్లిలో ఘటన
శాయంపేట, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): బడిలో పారిశుధ్య కార్మికురాలిగా గదులు, పరిసరాలను శుభ్రం చేయడం అనే బాధ్యత మాత్రమే కాదు.. అవసరమైతే పిల్లలకు పాఠాలూ చెప్పగలను అని చాటుకుంది ఆ యువతి. బడిలో విధులు నిర్వహిస్తున్న ఆ ఒక్క ఉపాధ్యాయురాలు ఆ రోజు విధులకు రాకపోవడంతో తానే టీచర్‌గా మారింది. చిన్నారులతో ఓపిగ్గా అక్షరాలు దిద్దించింది. పాఠాలూ చెప్పింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక కాంప్లెక్స్ పరిధిలోని జోగంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన అక్కడి వారిని అబ్బురపరిచింది. బడిలో ఐదు తరగతుల్లో మొత్తంగా 10 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయురాలు రాధిక సోమవారం విధులకు హాజరుకాలేదు. అక్కడ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నజ్మా ఆ రోజంతా టీచర్‌గానూ విధులు నిర్వహించారు. ఈ విషయమై కాంప్లెక్స్ హెచ్‌ఎం సారయ్య నాయక్‌ను వివరణ కోరగా ఏకోపాధ్యాయురాలు రాధిక సెలవులో ఉన్నారని చెప్పారు. కాంప్లెక్స్ సమావేశాలు ఉండటంతో మరో టీచర్‌ను నియమించలేకపోయామని.. పర్యవేక్షణ కోసం క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ)ను ఉంచామని, ఆయన మండల విద్యా వనరుల కేంద్రానికి వెళ్లి ఉండొచ్చునని వివరించారు. కాగా పారిశుధ్య కార్మికురాలు నజ్మా డిగ్రీ పూర్తిచేశారు. ఉపాధి కోసం ఆ పాఠశాలలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు గౌరవ వేతనంగా నెలకు రూ.3వేలు ఇస్తున్నట్లు తెలిసింది. బోధన తన పని కానప్పటికీ విద్యార్థులకు నష్టం కలగకుండా ఆమె చొరవ తీసుకొని పిల్లలకు పాఠాలు చెప్పడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.