బాలికను చిదిమేసిన ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:17 AM
అమ్మమ్మ ఇంటికొచ్చి తిరిగివెళ్తున్న ఓ బాలికను ఆర్టీసీ బస్సు మృత్యువై కబళించింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల సమీపంలోని...
అమ్మమ్మ ఇంటికొచ్చి తిరిగెళ్తుండగా విషాదం
సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో ఘటన
పుల్‌కల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అమ్మమ్మ ఇంటికొచ్చి తిరిగివెళ్తున్న ఓ బాలికను ఆర్టీసీ బస్సు మృత్యువై కబళించింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. సదాశివపేట మండ లం పెద్దాపూర్‌కు చెందిన బూరగోని స్రవంతి-భాస్కర్ దంపతుల పెద్ద కూతురు వైష్ణవి (13). అమ్మమ్మ ఊరైన పుల్‌కల్ మండలం మిన్‌పూర్‌లో శనివారం జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి తన తల్లిదండ్రులు, చెల్లెలు శ్రీకృతితో కలిసి వచ్చింది. అయితే అమ్మమ్మ ఇంటి సమీపంలో నివసించే బంధువు కాసాల బాలరాజ్ ఆదివారం పెద్దాపూర్‌కు కూతురు రమ్యశ్రీతో కలిసి వెళ్తుండగా.. సొంతూరికి వెళ్లేందుకు వైష్ణవి కూడా ఆ బైక్ ఎక్కింది. ఈ నేపథ్యంలోనే తాడ్దానిపల్లి టోల్‌ప్లాజా దాటిన కొద్దిసేపటికే.. జోగిపేట నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి అతివేగంతో వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి ముగ్గురు కింద పడగా.. వైష్ణవి తలపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాలరాజ్, రమ్యశ్రీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించిన పుల్‌కల్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.