Share News

అమ్ముకొనేందుకే.. బిడ్డను కనాలని..!

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:02 AM

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ప్రాంతంలో పసికందుల విక్రయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో..

అమ్ముకొనేందుకే.. బిడ్డను కనాలని..!

  • వివాహం కాకుండానే బాలికను తల్లిని చేసిన వైనం

  • ఇద్దరు వ్యక్తులను ఆ బాలికతో సంబంధానికి ప్రోత్సహించిన ఆమె తల్లి

  • పుట్టే బిడ్డను విక్రయించేందుకు మొదట ఒప్పుకున్న బాలిక

  • చివరి నిమిషంలో పేగుబంధంతో విక్రయానికి నిరాకరణ

  • సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ ఘటనలో విస్తుపోయే విషయాలు

  • ఆంధ్రజ్యోతి కథనంతో పోలీసుల విచారణ

పటాన్‌చెరు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ప్రాంతంలో పసికందుల విక్రయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో వచ్చిన ‘ఓ తల్లివిజయం’ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివా్‌సరావు ఆధ్వర్యంలో పలు విభాగాల అధికారులు ఇస్నాపూర్‌ పరిధి రుద్రారం గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బిడ్డను విక్రయించేందుకు చివరి నిమిషంలో నిరాకరించిన బాలిక వివాహం కాకుండానే తల్లి అయినట్లు గుర్తించారు. ఆమెకు పుట్టే బిడ్డను విక్రయించేందుకు ఆ బాలిక తల్లి ఇద్దరు వ్యక్తులను ఆమెతో సంబంధానికి పురికొల్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుమారు ఏడు నెలలపాటు ఒకరు.. ఆ తర్వాత మరొకరు ఆ బాలికతో కలిసి ఉన్నట్లు గుర్తించారు. బాలిక సైతం తనకు పుట్టే బిడ్డను విక్రయించేందుకు తొలుత అంగీకరించినా.. తీరా బిడ్డ పుట్టిన తర్వాత పేగు బంధం ఆమెను అడ్డుకుంది. దీంతో ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేయటంతో శిశు విక్రయాల విషయం బయటపడింది. బాలికను తల్లిని చేసిన వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వినాయకరావు తెలిపారు. అలాగే, బిడ్డను విక్రయించేందుకు తొలుత అంగీకరించినందుకు ఆ బాలికపైనా కేసు నమోదుచేస్తామని చెప్పారు.

గతంలోనూ శిశు విక్రయాలు..

ఇస్నాపూర్‌ ప్రాంతంలో గతంలో జరిగిన శిశు విక్రయాలపై పోలీసులు ఆరా తీశారు. ఇద్దరు మహిళలు శిశువులను విక్రయించినట్లు గుర్తించారు. ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కడైనా జరిగాయా అన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇతర రాష్ర్టాల వలస కూలీలు ఉంటున్న ప్రాంతాల్లో నిఘా పెట్టారు. బాలికకు పుట్టిన ఆడ శిశువును సంగారెడ్డి పిల్లల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు.

Updated Date - Jun 19 , 2026 | 03:02 AM