12 వేల గోనె సంచుల చోరీ!
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:39 AM
గోనె సంచుల కొరత పేరుతో తమ జొన్నలు కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు.. మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాలకు పంపిన ఖాళీ సంచులను చోరీ చేశారు.
వాహనం అడ్డగించి తీసుకెళ్లిపోయిన రైతులు
కల్హేర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): గోనె సంచుల కొరత పేరుతో తమ జొన్నలు కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు.. మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాలకు పంపిన ఖాళీ సంచులను చోరీ చేశారు. తమ గ్రామం మీదుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని అడ్డగించి 12 వేల సంచులనుతీసుకెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని ఇందిరానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్హేర్, బీబీపేటలో జొన్నల కొనుగోలు కేంద్రాలకు 24 వేల ఖాళీ సంచులను శనివారం ఉదయం సంబంధిత అధికారులు వాహనంలో పంపించారు. కల్హేర్‌లో 12 వేల బస్తాలను దించి.. తిరిగి బీబీపేటకు వెళ్తుండగా దర్గా సమీపంలో అడ్డగించిన ఇందిరానగర్ రైతులు.. వాహనంలోని సంచులను కిందపడేసి ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కల్హేర్ పోలీసులు, బీబీపేట పీఏసీఎస్ సీఈవో రాంచందర్ ఇందిరానగర్‌కు చేరుకుని రైతుల వివరాలు సేకరించారు. ఓవైపు బస్తాల కొరత, మరోవైపు వర్షాలు మొదలుకావడంతో ఆందోళన చెందిన తమ గ్రామస్థులు సంచులు తీసుకెళ్లారని.. మానవతా దృక్పథంతో చర్యలు తీసుకోవద్దని సర్పంచ్ సంగయ్య కోరారు. జొన్న రైతుల పేర్లు నమోదు చేసుకున్న పోలీసులు, అధికారులు కొనుగోలు టోకెన్లను జారీ చేస్తామని తెలిపారు.