అక్రమ చేపల చెరువుల ధ్వంసం
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:29 AM
మంజీరా నది, సింగూరు రిజర్వాయర్ చుట్టూ కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మించిన చేపల చెరువులను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేస్తున్నారు.
3 గ్రామాల్లో 16 చెరువుల తొలగింపు
నాలుగైదు రోజుల్లో మిగతావి కూడా
సంగారెడ్డి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంజీరా నది, సింగూరు రిజర్వాయర్ చుట్టూ కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మించిన చేపల చెరువులను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. ఈ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టి వాటికి ఆహారంగా చికెన్ వ్యర్థాలు, కుళ్లిన గుడ్లు వేస్తుండడంపై ఈ నెల 11న ఆంధ్రజ్యోతిలో ‘జీవ జలమా చేదు విషమా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అదే రోజు ట్రాన్స్‌కో, విజిలెన్స్ అధికారులు స్పందించి అక్రమ చెరువులను తనిఖీ చేశారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించి పదిమందిపై కేసులు నమోదు చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ సైతం స్పందించి, సమగ్ర నివేదికను అందించాలని కలెక్టర్, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం నీటిపారుదల శాఖ జిల్లా అధికారి భీమ్ నేతృత్వంలో 4 ఎక్స్‌కవేటర్లను తీసుకెళ్లారు. ఒక బృందం అక్రమ చెరువులను గుర్తిస్తుండగా మరో బృందం ఎక్స్‌కవేటర్లతో ధ్వంసం చేస్తోంది. ప్రస్తుతం ఖాదీరాబాద్, నీర్జప్ల, ఉసిరికపల్లి గ్రామాల్లో 16చెరువులను ధ్వంసం చేశారు. భారీ చెరువులు కావడంతో వాటిని ధ్వంసం చేయడం ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో పూర్తిగా తొలగిస్తామన్నారు.