కాంగ్రెస్ అభ్యర్థిది గల్లా పట్టాడని కాంగ్రెస్ అభ్యర్థిది గల్లా పట్టాడని
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:56 AM
సంగారెడ్డిలోని 34వ వార్డులో మునిసిపల్ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నారని అక్కడ విధుల్లో ఉన్న సీఐ శివకుమార్‌కు కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూ ఫిర్యాదు చేశాడు.
సంగారెడ్డి లోని 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత.. దొంగ ఓట్లేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు
పోలీసులు పట్టించుకోలేదని..సీఐ తన గల్లాపట్టి నెట్టివేశాడని జగ్గారెడ్డికి సమాచారమిచ్చిన అభ్యర్థి
పోలింగ్ కేంద్రానికి చేరుకున్న జగ్గారెడ్డి
సీఐ పై తీవ్రపదజాలంతో దూషణ
పోలింగ్ రద్దు చేయాలన్న జగ్గారెడ్డి
సీఐపై చర్యలకు అడిషనల్ ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ
సంగారెడ్డి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డిలోని 34వ వార్డులో మునిసిపల్ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నారని అక్కడ విధుల్లో ఉన్న సీఐ శివకుమార్‌కు కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూ ఫిర్యాదు చేశాడు. విషయాన్ని పట్టించుకోకుండా సీఐ తనపై దురుసుగా ప్రవర్తిస్తూ గల్లా పట్టి నెట్టివేశాడని అతను జగ్గారెడ్డికి సమాచారం అందించాడు. దీంతో మోటార్‌బైక్‌పై జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. దొంగ ఓట్ల అంశం, సీఐ దురుసు ప్రవర్తన గురించి స్థానికులు చెప్పడంతో జగ్గారెడ్డి ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. సీఐ శివకుమార్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించగా డీఎస్పీ, పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని, పోలింగ్ రద్దు చేసేదాకా కదిలేది లేదంటూ జగ్గారెడ్డి భీష్మించారు. గంజాయి బ్యాచ్ సీఐగా ముద్రపడిన శివకుమార్ బీఆర్‌ఎస్ పార్టీకి చెంచాగాడని తీవ్రంగా మండిపడ్డారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించాడని ఆగ్రహించారు. పోలీసులు మంచివాళ్లేనని అయితే ఇలాంటి ఒకరిద్దరి వల్ల సంగారెడ్డిలో సమస్యలు వస్తున్నాయన్నారు. సీఐ రెచ్చగొట్టడం వల్లనే 26 ఏళ్ల తర్వాత తాను పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చానని, అతన్ని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. అడిషనల్ ఎస్పీ రఘునందన్ ఘటనా స్థలం వద్దకు చేరుకొని సీఐపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జగ్గారెడ్డి శాంతించారు.