సంగారెడ్డి డీసీహెచ్‌ఎస్‌పై వేటు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:28 AM
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రులు, టీవీవీపీ కమిషనరేట్ కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది.
వైద్యులు లేకుండానే జీతం డ్రా చేసినట్లు వెల్లడి
ఆంధ్రజ్యోతి కథనంతో తక్షణ విచారణ
హైదరాబాద్, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రులు, టీవీవీపీ కమిషనరేట్ కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది. సంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ షరీఫ్ నిర్వాకం బయటపడటంతో ఆయనను సస్పెండ్ చేస్తూ హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్థు ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘‘లేని వైద్యులకు నెలనెలా జీతం వేతనం’’ కథనంపై స్పందించిన ప్రభుత్వం తక్షణ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఇవో ఉదయ్‌కుమార్, డిస్ట్రిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శశాంక్ పఠాన్‌చెర్వు ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. ఉద్యోగం మానేసిన డాక్టర్ పేరిట, అలాగే మరో మహిళా డాక్టర్ పేరిట కూడా జీతం డ్రా చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి ఉదయ్‌కుమార్ 2రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నారు. అయితే హైదరాబాద్‌లోని వైద్యవిధాన పరిషత్ కమిషనరేట్ కార్యాలయంలో జరుగుతోన్న సరెండర్ల వ్యవహారంపై ఎందుకు విచారణ జరపడం లేదంటూ వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పదోన్నతులు, షోకాజ్ నోటీసులు, చార్జీమోమోలు అందుకున్న వైద్యుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.