పెళ్లి ఇంట్లో విషాదం
ABN , Publish Date - May 06 , 2026 | 07:08 AM
తెల్లవారితే పెళ్లి జరగాల్సిన ఇంట్లో ముగ్గురు కు టుంబసభ్యులు మరణించడంతో సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది.
దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. తల్లి, కూతురు, మరో చిన్నారి దుర్మరణం
సంగారెడ్డి జిల్లా బోర్గి తండాలో ఘటన
కంగ్టి, మే 5 (ఆంధ్రజ్యోతి): తెల్లవారితే పెళ్లి జరగాల్సిన ఇంట్లో ముగ్గురు కు టుంబసభ్యులు మరణించడంతో సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. బోర్గి తండాకు చెందిన జాదవ్ సావిత్రిబాయి(35), పరశురాం దంపతులు హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నెల 6న సావిత్రిబాయి మరిది కుమార్తె వివాహం ఉండటంతో ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం సావిత్రిబాయి.. తన కూతురు నిఖిత(13), మరిది కూతురు నందిని(13)తో కలిసి బట్టలు ఉతికేందుకు తండా సమీపంలోని బావి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో నందిని కాలుజారి బావిలో పడిపోగా.. ఆమెను కాపాడబోయి నిఖిత, వారిద్దరిని రక్షించే క్రమంలో సావిత్రిబాయి బావిలోకి దూకి ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.