సనత్‌నగర్ టిమ్స్‌ను తీర్చిదిద్దండి!
ABN , Publish Date - May 12 , 2026 | 04:19 AM
ప్రజలకు పూర్తి స్థాయిలో సమగ్ర వైద్య సేవలు అందించేలా సనత్‌నగర్ టిమ్స్‌ను తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ప్రజలకు సమగ్ర వైద్యసేవలు లభించాలి
సమీక్షలో మంత్రి దామోదర
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు పూర్తి స్థాయిలో సమగ్ర వైద్య సేవలు అందించేలా సనత్‌నగర్ టిమ్స్‌ను తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న ‘వైద్య సేవల ట్రయల్ రన్’పై మంత్రి సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఓపీ రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ రూమ్‌లు, వెయిటింగ్ ఏరియా, డయాగ్నస్టిక్స్, రేడియాలజీ డిపార్ట్‌మెంట్, ఇన్‌పేషంట్ డిపార్ట్‌మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల గురించి మంత్రి ఆరా తీశారు. గుండె సంబంధిత ఆపరేషన్లు, అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించేలా క్యాథల్యాబ్స్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్ల ఏర్పాటు గురించి అధికారులను ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, భద్రత వంటి వైద్యయేతర విభాగాలు కూడా పటిష్ఠంగా ఉండాలని, పేషంట్లు, వారి అటెండెంట్లకు భోజన సదుపాయం కల్పించాలని, అటెండెంట్ల వసతి కోసం ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
జీవో 38 ప్రకారమే బదిలీల ప్రక్రియ
ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 ప్రకారం పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపడతామని మంత్రి దామోదర సోమవారం సచివాలయంలో తనను కలిసిన ‘ప్రభుత్వ వైద్యుల సంఘం’ (టీజీడీఏ) ప్రతినిధులకు స్పష్టం చేశారు. టీజీడీఏ ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి కూడా బదిలీల్లో అవకాశం ఇవ్వాలని, జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి హైదరాబాద్‌లోని కాలేజీల్లోకి వచ్చేందుకు అనుమతించాలని డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. కాలేజీలు, హాస్పిటళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీవో ప్రకారం బదిలీలుంటాయన్నారు. మరోవైపు, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు మంగళవారం ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ సందర్భంగా మంత్రి దామోదర నియామక ఉత్తర్వులను అందజేయనున్నారు. ఆరోగ్యశాఖలో 1919, కార్మికశాఖలో 257 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు భర్తీ చేసింది. ఇందులో ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు పొందిన 1919 మందికి మంగళవారం నియామక పత్రాలు అందజేయనున్నారు.
ప్రెస్‌క్లబ్ సభ్యులకు నిమ్స్‌లో పరీక్షలు
రాష్ట్ర అవతరణ వారోత్సవాన్ని పురస్కరించుకొని నిమ్స్ ఆసుపత్రిలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్‌ను నిర్వహించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షురాలు అరుణ.. మంత్రి దామోదరను సచివాలయంలో కలసి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి చెక్‌పకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు.