Share News

సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ

ABN , Publish Date - May 02 , 2026 | 05:55 AM

సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రిలో ఓపీ(అవుట్‌ పేషెంట్‌) సేవలు మొదలయ్యాయి. అయితే, పూర్తి స్థాయిలో కాదు. వచ్చే జూన్‌ 2వ తేదీ నుంచి సనత్‌నగర్‌ టిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్య...

సనత్‌నగర్‌ టిమ్స్‌లో ఓపీ షురూ

  • ట్రయల్‌ రన్‌ కింద నెల రోజుల పాటు సేవలు

  • జూన్‌ 2 నుంచి పూర్తిస్థాయి వైద్యసేవలు

హైదరాబాద్‌ సిటీ/ఎర్రగడ్డ, మే 1 (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రిలో ఓపీ(అవుట్‌ పేషెంట్‌) సేవలు మొదలయ్యాయి. అయితే, పూర్తి స్థాయిలో కాదు. వచ్చే జూన్‌ 2వ తేదీ నుంచి సనత్‌నగర్‌ టిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రయల్‌ రన్‌ కింద శుక్రవారం నుంచి ఓపీ సేవలను ప్రారంభించారు. నెల రోజుల పాటు ఈ ట్రయల్‌ రన్‌ కొనసాగనుంది. ఇందులో భాగంగా తొలి రోజు, శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ సహా మొత్తం 22 విభాగాల్లో ఓపీ నిర్వహించారు. మొదటి రోజు 32 మంది రోగులు ఆస్పత్రి సేవలను పొందారు. శుక్రవారం ఉదయం మొదటి రోగి.. మణేమ్మ అనే మహిళ ఓపీ కౌంటర్‌కు రాగా సనత్‌నగర్‌ టిమ్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ స్వయంగా ఆమె వివరాలు తీసుకున్నారు. ట్రయల్‌ రన్‌ ప్రారంభానికి ముందు ఆస్పత్రి వైద్యులతో అధికారులు సమావేశమయ్యారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా అవుట్‌ పేషెంట్‌, డయాగ్నసిస్‌ సేవలు అందించనున్నామని తెలిపారు.

Updated Date - May 02 , 2026 | 05:55 AM