టిమ్స్ రెడీ
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:38 AM
సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్..
నేటి నుంచే సనత్‌నగర్ ఆస్పత్రిలో వైద్యసేవలు
ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సనత్‌నగర్ టిమ్స్
1082 పడకలు.. అందులో 300 ఐసీయూ బెడ్స్
తొలుత ఓపీ సేవలు, నెల తర్వాత సర్జరీలు
2 నిమిషాల్లోనే రక్త నమూనాలు టెస్టింగ్ ల్యాబ్‌కు
1126 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం
2360 పోస్టులు మంజూరు చేసిన సర్కారు
సాధారణ రోగులకు నిమ్స్ మాదిరిగానే చార్జీలు
హైదరాబాద్/సిటీ, ఎర్రగడ్డ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఆర్‌ఎంసీఆర్ టిమ్స్) నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఆస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తం రూ.1126 కోట్ల వ్యయంతో 22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ సమగ్ర వైద్య సముదాయాన్ని అభివృద్ధి చేశారు. నాలుగు బ్లాకులుగా నిర్మించిన ఈ ఆస్పత్రి 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించింది. ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నిర్మితమైన ఈ ఆస్పత్రిలో ఏర్పాటు చేయటం విశేషం. ఈ వ్యవస్థ ద్వారా రోగుల నుంచి పరీక్షలు చేసేందుకు సేకరించిన నమూనాలు ఒకటి నుంచి రెండు నిమిషాల్లోనే సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరతాయి. ఆస్పత్రిలోని నాలుగు ప్రధాన బ్లాకుల్లో మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రో బయాలజీ ల్యాబ్‌లు, 10 బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి.
పూర్తి స్థాయి వైద్య సముదాయం
సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి దశలవారీగా సంవత్సరాలపాటు కొనసాగుతుంటుంది. అందుకు భిన్నంగా టిమ్స్ సనత్‌నగర్‌ను ఒకే దశలో, ఒకే మాస్టర్‌ప్లాన్ కింద సంపూర్ణ సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఆస్పత్రిలో మొత్తం 1,082 పడకలు, అందులో 300 ఐసీయూ పడకలు ఉన్నాయి. మొత్తం పడకల్లో దాదాపు 30 శాతం ఐసీయూలకు కేటాయించడం ద్వారా అత్యవసర, క్లిష్ట వైద్య సేవలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఆస్పత్రి కోసం సర్కారు 2360 పోస్టులను కూడా మంజూరు చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు తెలంగాణ ప్రభుత్వం ఈపీసీ విధానంలో అప్పగించగా ఆ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆస్పత్రిలో అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక సదుపాయాల్లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సీల్డ్ ట్యూబ్‌లు, గాలి ఒత్తిడితో రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వినియోగ వస్తువులను వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌లు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1-2 నిమిషాల్లో ఈ విధానం ద్వారా తరలించవచ్చు. దీంతో పరీక్షల ఫలితాల కోసం సమయం తగ్గడంతోపాటు కలుషితమయ్యే ప్రమాదం తగ్గుతుంది.
6 కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్ వంటి ఆరు ప్రధాన రంగాల్లో టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దింది. కిడ్నీ, కాలేయం, గుండె, బహుళ అవయవ మార్పిడి ేసవలకు ఇక్కడ అవకాశం ఉంది. ఆధునిక కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు, లీనాక్ ఆధారిత రేడియోథెరపీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ బ్యాక్‌పతో 30 క్లినికల్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి.
అత్యాధునిక స్కానింగ్ సదుపాయాలు
ఆస్పత్రిలో 3.0 టెస్లా ఎంఆర్‌ఐ, 128-స్లైస్ సీటీ స్కానర్, అధునాతన మామోగ్రఫీ యూనిట్, 5 ఎక్స్‌రే యంత్రాలు ఏర్పాటు చేశారు. రోగులతో వచ్చే సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో నిర్మించిన ధర్మశాలలో 200 మందికి వసతి సదుపాయాలున్నాయి. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీతో పాటు, కేంద్ర వంటశాల, లాండ్రీ, మెడికల్ ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థలకు ప్రత్యేక బ్లాకులు ఇందులో నిర్మించారు. ఇక్కడ తొలుత ఓపీ సేవలను అందించనున్నారు. ఓపీతో పాటు డే కేర్ సర్జరీలు కూడా చేస్తారు. అంటే ఒకేరోజులో ఆపరేషన్ చేసి డిశ్చార్జి చేస్తారన్న మాట. నెల రోజుల తర్వాత పూర్తిస్థాయిలో ఇన్‌పేషంట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెలరోజులు ఆపరేషన్ థియేటర్ల స్టెరిలైజేషన్, ఫ్యుమిగేషన్ చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
75 శాతం నీటి పొదుపు.. ఐజీబీసీ గోల్డ్ రేటింగ్
ఈ ఆస్పత్రి నిర్మాణంలో పర్యావరణహిత సాంకేతికతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ విధానం ద్వారా 75 శాతం నీరు ఆదా అవుతుంది. తగిన సామర్థ్యంతో ఎస్టీపీ, ఈటీపీలు ఏర్పాటు చేసి మురుగునీరు, వ్యర్థ ద్రవాలను ఈ ఆసుపత్రిలో శుద్ధి చేయనున్నారు. వర్షపు నీటిని ేసకరించి యార్డ్ వాటర్ సంపుల ద్వారా మొక్కలు, గ్రీన్ కారిడార్లకు వినియోగించే విధానం ఇక్కడ అమలుకానుంది. పర్యావరణహిత నిర్మాణం, ఇంధన సామర్థ్య వ్యవస్థల కారణంగా ప్రాజెక్టుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గోల్డ్ రేటింగ్ లభించింది. నిర్మాణ సమయంలో 35 లక్షల సురక్షిత పని గంటలు నమోదు చేసినట్లు ఎంఈఐఎల్ గ్రూప్ తెలిపింది.
కీలక చికిత్సలకు కేంద్రంగా...
ఇంత వరకు గుండె జబ్బులు వస్తే గాంధీ, ఉస్మానియాకు లేకపోతే నిమ్స్ ఆస్పత్రులకు పరుగులు తీసేవారు. చిన్న పిల్లల వైద్య సేవలకు కేవలం నిలోఫర్ ఆస్పత్రి మాత్రమే దిక్కయ్యేది. ఇప్పుడు చిన్నపిల్లలతో పాటు పెద్దలకూ గుండె జబ్బులు, మూత్ర, కిడ్నీ సంబంధిత, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ చికిత్సలను టిమ్స్ అందించనుంది. ఇంత వరకు నిమ్స్ వరకు పరిమితమైన కీలక అవయవ మార్పిడిలు ఇక నుంచి ఇక్కడ చేయనున్నారు. నిమ్స్ మాదిరిగా టిమ్స్ స్వయంప్రతిపత్తితో సేవలు అందించబోతోంది. పేదలకు ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి సహకారంతో వైద్యం చేయనున్నారు. ఇతరులకు నిమ్స్ మాదిరిగా చార్జీలు వసూలు చేస్తారు.
ఏయే బ్లాకుల్లో ఏయే సేవలంటే..
బ్లాక్-ఏ: అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉన్నాయి.
బ్లాక్-బీ: ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, 2 క్యాథ్‌ల్యాబ్‌లు ఉన్నాయి.
బ్లాక్-సీ: రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి.
బ్లాక్-డీ: పరిపాలన, విద్యా విభాగాలతోపాటు 200 మంది కూర్చునే ఆడిటోరియం ఉంది.
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం టిమ్స్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక, ప్రవేశం, వెలుపలికి వెళ్లే మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.