జగన్మాత నమోస్తుతే..
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:05 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మంగళవారం దసరా పండుగ, దేవీ శరన్నవరాత్రులను భక్తిశ్రద్ధలతో ముగించారు. జగన్మాత నమోస్తుతే.. అంటూ బుధవారం తెల్లవారుజాము వరకు వైభవంగా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. విందు, వినోదాలతో ప్రతి ఇంటా దసరా సందడి
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మంగళవారం దసరా పండుగ, దేవీ శరన్నవరాత్రులను భక్తిశ్రద్ధలతో ముగించారు. జగన్మాత నమోస్తుతే.. అంటూ బుధవారం తెల్లవారుజాము వరకు వైభవంగా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. విందు, వినోదాలతో ప్రతి ఇంటా దసరా సందడి కనిపించింది. దసరా ఇంటింటా సరదాలు, సంబురాలను నింపింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో, భీమేశ్వరాలయంలో దసరా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా ఎడ్లబండి తోలుతూ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఆనంతరం శమి పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మానేరు తీరంలో రామలీల మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దశకంఠుడి దహనాన్ని ప్రజలు వీక్షించారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ పల్లెల్లో పండుగ ఆనందం వెల్లివిరిసింది. పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం వెళ్లిన జనం పల్లెలకు చేరుకోవడంతో పండుగా హడావిడి మరింత పెంచింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఒక చోట చేరి పండుగ జోష్ జరుపుకున్నారు. బతుకమ్మతో పాటు దసరాలను జిల్లాలో అతి పెద్ద పండుగగా పరిగణిస్తారు. దసరా వేళ విజయానికి సంకేతంగా రావణ వధ ఘట్టాలు నిర్వహించారు.
రావణ వధ వేడుకలు
చెడుపై విజయంగా భావిస్తూ జిల్లాలో రావణ వధ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం సాయంత్రం సిరిసిల్ల మానేరు తీరంలో జమ్మిగద్దె వద్ద మొదట శ్రీలక్ష్మీవేంకటేశ్వర అశ్వవాహనంపై ఊరేగింపుగా వచ్చి శమీదర్శనం చేశారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జమ్మి చెట్టుతో శోభాయాత్ర నిర్వహించారు. శమీదర్శనం, రామ్‌లీల వేడుకలకు వేలాది మంది తరలివచ్చారు. ఎస్పీ మహేష్ బీ గీతే, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, మాజీ చైర్మన్ అడెపు రవీందర్ శ్రీరాముడి వేషధారణతో రావణ వధ వేడుకలను ప్రారంభించారు. జనసందోహం మధ్య రావన దహనం జరిగింది. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విజయదశమి ప్రజలందరికి సుఖసంతోషాలు కలిగించాలన్నారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమాన్ని ప్రతియేటా విజయవంతంగా నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రజలకు చైర్మన్ చేపూరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
శమీ, ఆయుధ పూజలు
విజయదశమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శమీ పూజలు, ఆయుధ పూజలు జరిపారు. జిల్లా కేంద్రంలోని వివిధ సంస్థలు, వివిధ రాజకీయ పార్టీ కార్యాలయాల్లో, ప్రైవేట్ ఆఫీసుల్లో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు, ఆయుధ పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకు మామిడాకులు, బంతిపూల దండలు కట్టారు. గుమ్మడి కాయలు కొట్టారు. జిల్లాలోని పవర్‌లూం కార్ఖానాలు, వివిధ ప్యాక్టరీల్లో పూజా కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. దసరా శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ వాహనాలకు పూజలు చేశారు. దసరా రోజు ఊరు శివార్లలో పల్లెల్లో పాలపిట్టను దర్శించుకున్నారు. పాలపిట్ట కనబడితే సంవత్సరం పొడవునా విజయాలు కలుగుతాయని శుభసూచకంగా భావిస్తారు.
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
అశ్వయుజ శుద్ధ దశమిని విజయానికి సంకేతంగా అమ్మవారిని ఆరాధించుకుంటూ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన శరన్నవరాత్రి ఉత్సవాలు దసరా రోజు పూర్ణాహుతితో నిర్వహించారు. మంగళవారం రాత్రి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమ్మవారిని వివిధ ప్రాంతాల్లో శోభాయాత్రగా ప్రజలకు దర్శనం కల్పించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతించారు.
ప్రజలందరూ విజయాలు సాధించాలి..
- ఎస్పీ మహేష్ బీ గితే
ప్రజలందరూ అన్ని రంగాల్లో విజయాలను అందించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్పీ మహేష్ బి గితే దుర్గాదేవికి, శమికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ, పోలీసు వాహనాలకు వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.